Kazipet Railway station: మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు
తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి. రైల్వే శాఖ "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" ద్వారా ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ స్కీమ్‌లో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలను రైల్వే ప్రయాణీకులకు అందించేందుకు భారత రైల్వే సంస్థ భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను చేపడుతోంది. ఈ కార్యాచరణలో కాజీపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది. కాజీపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 24.5 కోట్ల రూపాయలను కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి డిజైన్ ఫొటోల్ని విడుదల చేసింది.
యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 24.5 కోట్లతో పనులు
"అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్"లో భాగంగా కాజీపేట్ రైల్వే జంక్షన్‌ను ఆధునాతన స్టేషన్‌గా మారుస్తారని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాల ఏర్పాట్లు, స్టేషన్లో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులను చేపడతారు. స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అదే విధంగా, యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 24.5 కోట్లతో పనులు ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. యాదాద్రి స్టేషన్‌ను ఆలయం రూపంలో అభివృద్ధి చేయనున్నారు. రైల్వే శాఖ రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో 39 స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించింది.
మొదటి విడతలో 21 స్టేషన్ల అభివృద్ధి
మొదటి విడతలో 21 స్టేషన్ల అభివృద్ధి పనులు చేపడతారు. ఈ అభివృద్ధిలో భాగంగా, స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, వై-ఫై, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను అందిస్తారు. 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' షాపులను కూడా ఏర్పాటు చేయనున్నారు, వాటి ద్వారా స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు కల్పించబడుతుంది. అలాగే, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటి పలు ఏర్పాట్లు కూడా చేయనున్నారు.