Hyderabad Traffic Alert: కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే.. 18 నుంచి కొత్త ట్రాఫిక్ విధానం అమలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. పార్కు పరిసరాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వన్‌వే విధానం అమలుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తిచేసినట్లు సీపీ సజ్జనర్ వెల్లడించారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన లేన్ మార్కింగ్‌లు,లేన్ ఛేంజర్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమైన కూడళ్ల వద్ద వాహనదారులకు సరైన దిశను సూచించేలా ట్రాఫిక్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. కొత్త వన్‌వే విధానంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా మార్గనిర్దేశం,సహాయం అందించేందుకు కీలక ప్రాంతాల్లో 24×7ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
వివరాలు
గూగుల్ మ్యాప్స్‌లోనూ మార్పులు
వన్‌వే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా గూగుల్ మ్యాప్స్, ఇతర నావిగేషన్ రూట్లలో అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
దీంతో వాహనదారులు తమ ప్రయాణానికి ముందుగానే సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
సీసీటీవీ, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ
వన్‌వే అమలు సమయంలో కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు సీసీటీవీ నెట్‌వర్క్ ద్వారా ట్రాఫిక్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
అలాగే రద్దీ పరిస్థితిని రియల్‌టైమ్‌లో అంచనా వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగించనున్నారు.
వివరాలు
అవసరాన్ని బట్టి మార్పులు
వన్‌వే ట్రాఫిక్ విధానం ప్రారంభమైన తొలినాళ్లలో రహదారులపై ఏర్పడే ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షిస్తామని సీపీ సజ్జనర్ తెలిపారు.
రద్దీ, వాహనాల కదలికలను పరిశీలించిన అనంతరం అవసరాన్ని బట్టి ట్రాఫిక్ నిర్వహణలో తగిన మార్పులు, సర్దుబాట్లు చేపడతామని చెప్పారు.
ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి
ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే విధానం అమల్లోకి రానున్నందున వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సీపీ సూచించారు.
కొత్త ట్రాఫిక్ మార్గాలను దృష్టిలో ఉంచుకుని బయలుదేరే ముందు నావిగేషన్ రూట్లను పరిశీలించుకోవడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.