Kalvakuntla Kavitha: కేసీఆర్ మారిపోయిన మనిషి.. కవిత సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో తన కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన (TRS)'ను ప్రకటించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఈ రోజు మరచిపోలేనిదని కవిత పేర్కొన్నారు. "నేను అమ్మవారి భక్తురాలిని. నాకు సింగరేణి అంటే ఇష్టం. మీకంటే ఆడబిడ్డలంటే మరింత ఇష్టం. రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. బతుకమ్మ పాట వచ్చిన తర్వాత మన సంస్కృతికి ఊపిరి వచ్చిందని అన్నారు.
వివరాలు
కేసీఆర్ పాలనలో అశించిన ఫలితాలు రాలేదు
తెలంగాణ ఏర్పాటుకు కలలు కన్న లక్ష్యాలు నెరవేరలేదని, కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదని విమర్శించారు. బానిస సంకెళ్లు తెగుతాయనుకుంటే రైతులకు బేడీలు, ఉద్యమకారులపై కేసులు పెట్టారు. ఆ కాలంలో పాలించిన కుటుంబంలో నేనూ ఒకరిని. జరిగిన తప్పులకు క్షమించమని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడటానికి తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. రేపటి నుంచి మా పని ఎలా ఉంటుందో, మా పోరాటం ఎలా ఉంటుందో మీరు చూస్తారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్నారు. అమ్మతనంతో పాలన చేస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయి. రాష్ట్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు.
వివరాలు
గుంట నక్కల మధ్య కేసీఆర్ బందీ అయ్యారు
ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు. ఇప్పుడు ఆయన మారిపోయారు. గుంట నక్కల, తోడేళ్ల మధ్య బందీ అయిన వ్యక్తి కేసీఆర్ అని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిపక్వత కోల్పోయి మాట్లాడుతున్నారు. కేటీఆర్ తెలియక మాట్లాడకపోవచ్చు, కానీ కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కోసం, కేసీఆర్ కోసం పోరాడిన వారికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను చెప్పిన తర్వాత తనను బయటకు పంపించారని, ఇతరులను ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. "ఇప్పుడేమో మేమే ప్రతిపక్షం అవుతాం. రెండు సంవత్సరాల్లో అధికారంలోకి వస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.