మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వర్గీకరణ, మండలాల వర్గీకరణ జరిగిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్టంలో తెలంగాణలో ఉన్న 10జిల్లాలు తెలంగాణ ఏర్పడ్డాక 33జిల్లాలుగా మారాయి. జిల్లాలతో పాటు మండలాల సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో మరో మూడు మండలాలు పెరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల, సాత్నాల, బోరాజ్ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు గతకొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్‌పై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
ఆనందంలో ఆయా మండలాల ప్రజలు
కొత్త మండలాల ఏర్పాటు విషయాన్ని మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే జోగు రామన్న.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కుమ్రం అసిఫాబాద్ పర్యటనలో ఉన్న కేసీఆర్, ఈ విషయమై సానుకూలంగా స్పందించారు. సోనాల, సాత్నాల, బోరాజ్ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో మండలాలు ఏర్పాటు అవుతున్నాయన్న సంతోషంలో ఆయా గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు దన్యవాదాలు తెలియజేస్తున్నారు.