Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును జపిస్తే భర్తలకు భోజనం పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేసారు. దిల్లీలో 'మహిళల సన్మాన కార్యక్రమం' పేరుతో టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రధాని మోదీ పేరును చాలా మంది జపిస్తున్నారని, దానిని మహిళలే సరిదిద్దాలని సూచించారు. 'మీ భర్తలు మోడీ పేరును జపిస్తే, వారికి సేవ చేయబోమని చెప్పండి' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2024-25 బడ్జెట్‌లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.1,000 అందించే ప్రణాళికను ప్రకటించిన తర్వాత మహిళలతో సంభాషించడానికి కేజ్రీవాల్ ఈ కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ మహిళలకు ఏం చేసింది?: కేజ్రీవాల్
తనకు, ఆప్‌కి మద్దతిస్తామని ప్రమాణం చేయమని వారి కుటుంబ సభ్యులను అడగాలని అరవింద్ కేజ్రీవాల్ మహిళలను కోరారు. అలాగే, తమ సోదరుడు కేజ్రీవాల్ మాత్రమే మహిళలకు నిలబడుతాడని, ఈ విషయాన్ని బీజేపీకి మద్దతు ఇస్తున్న ఇతర మహిళలకు చెప్పాలని ఆయన కోరారు. తాను మహిళల కోసం కరెంటు ఉచితం, బస్సు టిక్కెట్లు ఉచితం, ఇప్పుడు మహిళలకు ప్రతి నెల రూ. 1,000 ఇస్తున్నానన్నారు. కానీ బీజేపీ మహిళలకు ఏం చేసిందని ప్రశ్నించారు. మహిళా సాధికారత పేరుతో మహిళలను బీజేపీ మోసం చేసిందన్నారు.