కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. కేరళ, తమిళనాడు, దిల్లీ, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలోని కలెక్టరేట్లు అభివృద్ధికి నిదర్శనమన్నారు మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. బీజేపీని గద్దె దించే కార్యక్రమం తెలంగాణ నుంచి ప్రారంభం కావాలన్నారు అఖిలేశ్. కేంద్రలోని మోదీ ప్రభుత్వానికి ఇంకా 400రోజులే మిగిలి ఉన్నాయన్నారు.
కేసీఆర్‌కు మా మద్దతు ఉంటుంది: కేరళ సీఎం విజయన్
భారత జాతికి మార్గం చూపే ప్రయత్నం తెలంగాణ నుంచి జరగడం అభినందనీయం అన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్వనాశనం చేస్తోందన్నారు. దేశంలోని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు అభినందనలు అన్నారు. బీజేపీపై పోరాటంలో తమ మద్దతు కేసీఆర్‌కు ఉంటుందని చెప్పారు విజయన్. దేశంలో బీజేపీ ప్రమాదకారిగా మారిందన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశ మౌలిక వ్యవస్థలను మారుస్తున్నాయన్నారు. పోరాట యోధులకు తెలంగాణ పుట్టినిల్లు అన్నారు. కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్ర తెలంగాణ అని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు గొప్ప పథకాలుగా రాజా అభివర్ణించారు.