 
                                                                                Kendriya Grihmantri Dakshata Padak: పహల్గాం ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు
ఈ వార్తాకథనం ఏంటి
'ఏక్తా దివస్' సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని దర్యాప్తు, ఆపరేషన్లు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,466 మంది పోలీసు సిబ్బందిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2025' అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే కేంద్ర బలగాల నుంచి ఎంపికైన వారిలో జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు.
వివరాలు
పహల్గాం ఆపరేషన్ వీరులు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేయడానికి నిర్వహించిన 'ఆపరేషన్ మహాదేవ్'లో పాల్గొన్న భద్రతా దళాల సిబ్బంది ఈ జాబితాలో ప్రధానంగా నిలిచారు. భారత సైన్యం, జమ్మూ పోలీసులు మరియు ఇతర భద్రతా బలగాలు కలిసి విజయవంతంగా పూర్తి చేసిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఐజీ (కశ్మీర్ రేంజ్) వి.కె. బిర్దీ, సీనియర్ ఎస్పీ (శ్రీనగర్) జీవీ సందీప్ చక్రవర్తి, అలాగే జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 మంది పోలీసు అధికారులు పురస్కారానికి ఎంపికయ్యారు. ఓ డీఐజీతో పాటు పలువురు ఎస్పీ, కానిస్టేబుల్ స్థాయి అధికారుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు 21 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఈ మెడల్‌ను అందుకోనున్నారు.
వివరాలు
తెలుగు రాష్ట్రాలకు గౌరవం
తెలంగాణ నుంచి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు.. లక్ష్మణరావు, జాకబ్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు.. చంద్రబాబు, ఉపేందర్ రావు, తిరుపతి ఈ పురస్కారానికి అర్హులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అదనపు ఎస్పీ భీమా రావు, డీఎస్పీ ఆర్.జీ. జయసూర్య, ఎస్‌ఐ ఎండీ నసీరుల్లా, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఫణి భూషణ్ ఎంపికయ్యారు.
వివరాలు
పురస్కారాల వెనుక నేపథ్యం
గతంలో హోంశాఖ పరిధిలో ఉన్న వివిధ ప్రతిభా పురస్కారాలను ఏకీకృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024లో 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్'ను ప్రవేశపెట్టింది. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31న జరుపుకునే 'ఏక్తా దివస్' సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. 2025 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా దర్యాప్తు, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ప్రత్యేక ఆపరేషన్లు వంటి విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 1,466 మంది పోలీసు, భద్రతా సిబ్బందికి ఈ గౌరవం లభించింది.