Kerala: పెదవి గాయానికి చికిత్స.. మత్తుమందు ఇచ్చిన వెంటనే 18 నెలల చిన్నారి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని కన్నూర్ జిల్లాలో 18 నెలల చిన్నారి మరణం విషాదాన్ని మిగిల్చింది. పెదవికి గాయమవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన బాలుడు, మత్తుమందు (అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లి అనంతరం మృతిచెందాడు. చికిత్సలో వైద్యురాలి నిర్లక్ష్యమే తమ కుమారుడి ప్రాణాలు తీసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం పూర్తిగా ఖండించింది. కన్నూర్ జిల్లా ఎరమం-కుట్టూర్ ప్రాంతానికి చెందిన టి. సూరజ్, విజయ షా దంపతుల కుమారుడు దేవాన్ష్ శౌర్య జులై 5న ఇంటి బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు.
వివరాలు
బాలుడి పెదవికి తీవ్ర గాయమై రక్తస్రావం
ఈ ఘటనలో బాలుడి పెదవికి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ముందుగా మథమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పయ్యన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పెదవి గాయానికి కుట్లు వేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. చికిత్సలో భాగంగా అనస్థీషియా ఇచ్చిన తర్వాత కుట్లు వేశారు. అయితే కొద్దిసేపటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు అత్యవసరంగా కన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రి శాఖకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బాలుడు మృతిచెందాడు.
వివరాలు
వైద్యురాలు అంజలి పొడువల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం
కుమారుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వైద్యురాలు అంజలి పొడువల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని వారు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 125 కింద వైద్యురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, చిన్నారి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలను బేబీ మెమోరియల్ ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించింది. మత్తుమందు ఇచ్చిన వెంటనే బాలుడికి ఊహించని రీతిలో గుండె సంబంధిత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి మెరుగైన చికిత్స కోసం కన్నూర్ శాఖకు తరలించినట్లు వెల్లడించింది.
వివరాలు
చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు వైద్య బృందం ప్రయత్నం
అనస్థీషియా సరైన మోతాదులోనే ఇచ్చామని, చికిత్సలో అన్ని వైద్య ప్రమాణాలను పాటించామని ఆస్పత్రి తెలిపింది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో ఇలాంటి అనుకోని వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొంది. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు వైద్య బృందం అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.