Kerala CM :కేరళ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. మే 4న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆరు రోజుల తర్వాత కూడా సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్త అసెంబ్లీని మే 23లోపు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపా దాస్‌మున్షీ మాట్లాడుతూ సీఎం అభ్యర్థిపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే రాష్ట్ర నాయకులు మాత్రం పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
వివరాలు
రాహుల్ గాంధీ జోక్యం
ఇదే సమయంలో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల అనుచరులు మాత్రం పోస్టర్లు,నిరసనలు, బహిరంగ ప్రచారాలతో తమ నేతలకు మద్దతుగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. పార్టీలో వర్గపోరు పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. సీఎం రేసులో ఉన్న వీ.డి. సతీశన్,కె.సి. వేణుగోపాల్,రమేశ్ చెన్నితల తమ అనుచరులను నియంత్రించాలని, అంతర్గత విభేదాలకు ముగింపు పలకాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య,డీకే శివకుమార్ మధ్య జరిగిన సీఎం పోరును గుర్తు చేస్తున్నాయి. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారింది కె.సి. వేణుగోపాల్ పాత్ర. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా సీఎం రేసులోకి రావడం చర్చనీయాంశమైంది.
వివరాలు
వేణుగోపాల్‌కు కొత్తగా ఎన్నికైన 43మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా భావించే వేణుగోపాల్‌కు కొత్తగా ఎన్నికైన 43మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీ.డి.సతీశన్, సీనియర్ నేత రమేశ్ చెన్నితల కూడా బలమైన పోటీదారులుగానే ఉన్నారు. సోనియా గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న చెన్నితలకు పార్టీలో మంచి పట్టుంది. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బహిరంగంగానే సతీశన్‌కు మద్దతు ప్రకటించింది. చెన్నితల అనుచరులు గత కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఊమెన్ చాందీకి గౌరవం ఇచ్చి సీఎం పదవిని వదులుకున్నారని,ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సతీశన్ వర్గం మాత్రం ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడి పార్టీ విజయానికి బాటలు వేసింది ఆయనేనని ప్రచారం చేస్తోంది.
వివరాలు
అసెంబ్లీకి పోటీ చేయని ఎంపీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయొచ్చా?
ఎన్నికల ముందు కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్ కూడా అసెంబ్లీ బరిలోకి దిగాలనుకున్నప్పటికీ పార్టీ పెద్దలు, మాజీ రక్షణ మంత్రి ఏ.కే. ఆంటోనీ సూచనలతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీలు పోటీ చేయరాదని కాంగ్రెస్ ముందుగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయని ఎంపీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయొచ్చా అనే ప్రశ్న కూడా పార్టీ ముందుంది. 140 సభ్యుల కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకుంది. ఐయూఎంఎల్ 22, కేరళ కాంగ్రెస్ 8, ఆర్‌ఎస్‌పీ 3 స్థానాలు సాధించడంతో యూడీఎఫ్ కూటమి మొత్తం 102 సీట్లతో ఘన విజయం సాధించింది. రెండొంతుల మెజారిటీని సులభంగా దాటింది