కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?
కేరళ గురువాయూర్ ఆలయ ఆస్తులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆలయం పరిధిలో ఎన్ని రూ. కోట్ల డిపాజిట్లు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది. కేరళ త్రిస్సూర్లోని గురువాయూర్ దేవస్థానం బ్యాంకు డిపాజిట్లు రూ. 1,737 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. అలాగే ఆలయం పేరు మీద 271 ఎకరాల భూమిని ఉంది. తిరువనంతపురంలోని శ్రీపద్మనాభస్వామి దేవాలయంలో గుప్త నిధులు బయటపడ్డాక.. గురువాయూర్ దేవస్థానం ఆలయం ఆస్తులపై అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా ఆర్టీఐ ద్వారా బ్యాంకు డిపాజిట్లు, భూమి వివరాలు తెలిసాయి.
అపారమైన బంగారం, వెండి ఆభరణాలు
ఆలయంలో అపారమైన బంగారం, వెండి, విలువైన రాళ్లు ఉన్నప్పటికీ.. వాటి విలువను మాత్రం గురువాయూర్ దేవస్థానం వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా వాటి వివరాలను, ఖచ్చితమైన విలువను వెల్లడించడానికి ఆలయ నిర్వాహకులు నిరాకరించారు. శ్రీమహావిష్ణువును కృష్ణునిగా పూజించే శతాబ్దాల నాటి ఈ దేవాలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. పురాతనమైన గురువాయూర్ దేవస్థానంలోని వజ్రవైఢుర్యాల విలువను లెక్కగడితే.. ఇంచుమించు పద్మనాభస్వామి ఆలయ స్థాయిలో ఆ లెక్క ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016లో రాష్ట్రంలో పినరయి విజయన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని దేవస్థానం ఆర్టీఐలో చెప్పింది.