Nipah alert: కేరళలో నిపా వైరస్ కలకలం.. కోజికోడ్ వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో పాజిటివ్
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో మరోసారి నిపా వైరస్ భయాందోళనలు నెలకొన్నాయి. కోజికోడ్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ విషయాన్ని అధికారులు గురువారం వెల్లడించారు. తుది నిర్ధారణ కోసం బాధితుడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపించగా, నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. బాధితుడు ఫెరోక్ ప్రాంతానికి చెందిన ఓ చిన్న వ్యాపారి. మొదట ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా, పరిస్థితి విషమించడంతో బుధవారం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
వివరాలు
కోజికోడ్ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నిపా వైరస్ అనుమానిత కేసు వెలుగులోకి రావడంతో, బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచే చర్యలను ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఆస్పత్రి సిబ్బంది, రోగిని కలిసిన ఇతర వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. కేరళ ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ మాట్లాడుతూ.. ప్రాథమిక పరీక్షలు, బాధితుడిలో కనిపించిన లక్షణాల ఆధారంగా నిపా వైరస్ సోకినట్లు అనుమానం ఉందని, అయితే ఎన్‌ఐవీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ధారణ జరుగుతుందని తెలిపారు. కోజికోడ్ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
వివరాలు
కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు
బాధితుడు మొదట ఓ ఆస్పత్రి అవుట్‌పేషెంట్ విభాగానికి వెళ్లాడని,అనంతరం ఎంఆర్ఐ,ఎకో కార్డియోగ్రఫీ పరీక్షలు చేయించుకున్నాడని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అతనితో సంబంధం ఉన్న వైద్య సిబ్బంది, ఇతర వ్యక్తులు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని ఎదుర్కొనేందుకు కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ దశలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇటీవల బాధితుడు తన వ్యాపారం కోసం ఓ గోదామును అద్దెకు తీసుకుని స్వయంగా శుభ్రం చేశాడని, ఆ సమయంలోనే వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మొదట ఆయనకు జ్వరం వచ్చి తగ్గిపోయిందని, తర్వాత మళ్లీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
వివరాలు
వైద్య కళాశాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి
ఈ ఘటనపై సమీక్ష నిర్వహించేందుకు గురువారం ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. బాధితుడు తిరిగిన ప్రాంతాల రూట్ మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు, అతనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం వైద్య కళాశాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, ఎన్‌ఐవీ తుది నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.