Kerala blast: క్రిస్టియన్ ప్రార్థనా సమావేశంలో పేలుడు.. ఒకరు మృతి.. 20మంది గాయాలు
కేరళలోని కొచ్చిలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కలమస్సేరీ ప్రాంతంలో గల క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20మందికిపైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 9గంటలకు మొదటి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత గంట వ్యవధిలో మరికొన్ని పేలుళ్లు జరిగాయని కలమసేరి సీఐ విబిన్ దాస్ తెలిపారు. విషయం తెలిసిన ఎన్ఐఏ వెంటనే రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. పేలుళ్లు జరిగినప్పుడు ప్రార్థనా సమావేశంలో 2,000 మందికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్ లోపల మూడు పేలుళ్ల శబ్ధం తనకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి
పేలుళ్ల ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అన్నారు. ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారులంతా ఎర్నాకులంలో ఉన్నారని, డీజీపీ ఘటనాస్థలికి వెళ్తున్నారన్నారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. దర్యాప్తును వేగవంతం చేయాలని తాను డీజీపీతో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వైద్య బృందాన్ని అలర్ట్ చేశారు. సెలవులో ఉన్న వైద్యులతో సహా ఆరోగ్య కార్యకర్తలందరూ వెంటనే తిరిగి రావాలని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. కలమస్సేరిలో జరిగిన పేలుడులో గాయపడిన వారికి ఉత్తమ చికిత్స అందించాలని ఆమె ఆరోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.