Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు కీలక అలర్ట్.. షెడ్యూల్‌లో నూతన మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో ముఖ్యమైన మార్పులను చేసింది. ఇప్పటివరకు బుధవారం నడవని కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 20703/20704)కు బదులుగా, ఇప్పుడు శుక్రవారం సేవలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. అదేవిధంగా ముందుగా గురువారం ఆపరేట్ కాని సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 20707/20708)ను ఇకపై సోమవారం నడపబోమని దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో తెలిపింది. ఈ మార్పులు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది.
Details
నాలుగు వందే భారత్ సర్వీసుల్లో మార్పులు
అయితే రైళ్ల టైమింగ్స్, హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీల్లో ఎలాంటి మార్పులు లేవని కూడా స్పష్టతనిచ్చింది. రైల్వే ప్రకారం నిర్వహణలో మెరుగుదల, సమయపాలన బలోపేతం, సేవా సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ నాలుగు వందే భారత్ సర్వీసుల షెడ్యూళ్లలో సవరణలు చేశారు. రైల్వే బోర్డు ఆమోదం అనంతరం ఈ నిర్ణయాలను అమలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. రద్దు చేసిన రోజుల్లో ముందుగానే టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులు రీఫండ్ పొందవచ్చని, లేదా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Details
ప్రయాణికులకు శుభవార్త
అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మంచి వార్తను అందించింది. తిరుపతి - సాయినగర్ షిర్డీ - తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (17425/17426) ప్రారంభించింది. ఈ రైలు డిసెంబర్ 14 నుంచి సేవలను అందించనుంది. ప్రతి ఆదివారం ఇది నడవనుంది. ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి, సాయంత్రం 4.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. అనంతరం సోమవారం ఉదయం 10.45 గంటలకు షిర్డీ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. ఈ కొత్త రైలులో రెండు ఏసీ కోచ్‌లు, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉండనున్నాయి.