Sabarimala darshan route : శబరిమల దర్శనం మార్గంలో కీలక మార్పు.. భక్తులకు మరింత సౌలభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
అయ్యప్ప భక్తుల చిరకాల కోరికను పరిగణనలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) శబరిమలలోని 'దర్శనం' మార్గాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి పవిత్ర 18 మెట్లు ఎక్కే భక్తులు నేరుగా స్వామి దర్శనానికి వెళ్లే విధంగా మార్పు చేయనున్నారు.
ఈ కొత్త మార్గాన్ని మార్చి 15 నుండి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.
విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు ఈ మార్గంలో దర్శనం కొనసాగిస్తామని, ఇది విజయవంతమైతే వచ్చే మండల-మకరవిలక్కు సీజన్‌లో శాశ్వతంగా అమలు చేస్తామని తెలిపారు.
Details
నెరవేరిన అయ్యప్ప భక్తుల కోరిక
18 పవిత్ర మెట్లు ఎక్కిన తర్వాత భక్తులకు మెరుగైన దర్శన అనుభవం కల్పించాలని కోరుతూ వేలాది లేఖలు, విజ్ఞప్తులు బోర్డుకు అందినట్లు ప్రశాంత్ తెలిపారు.
ప్రస్తుతం 18 మెట్లు ఎక్కిన భక్తులను వంతెన వద్ద నిలిపి, అక్కడ క్యూలో ఉంచుతారు. అనంతరం అవతలి వైపునకు వెళ్లి స్వామిని దర్శించాల్సి వస్తోంది.
దీంతో ప్రతి భక్తుడికి కేవలం 5 సెకన్ల దర్శనం మాత్రమే లభిస్తోంది. ఈ కారణంగా శబరిమల దర్శనానికి వచ్చే భక్తులలో దాదాపు 80 శాతం మంది అసంతృప్తిగా ఉంటున్నారని ప్రశాంత్ వివరించారు.
కొత్త మార్గంతో భక్తులకు 20 నుంచి 25 సెకన్ల పాటు దర్శనం లభించనుందని చెప్పారు.
Details
భక్తులతో ఆలయ అభివృద్ధి సమావేశం
శబరిమల ఆలయ అభివృద్ధికి అయ్యప్ప భక్తులను భాగస్వామ్యం చేయడానికి టీడీబీ పంబలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం నిర్వహించనుంది.
ఆలయ అభివృద్ధి కోసం బోర్డు వద్ద తగినన్ని నిధులు లేకపోవడం వల్ల, భక్తులు విరాళాలు ఇచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ప్రశాంత్ తెలిపారు.
ఈ సమావేశంలో 150 మంది పాల్గొంటారని అంచనా. మే నెలలో నెలవారీ పూజల సందర్భంగా రెండు రోజుల కార్యక్రమంగా నిర్వహిస్తామని వివరించారు.
Details
అయ్యప్ప స్వామి బంగారు పెండెంట్లు విడుదల
అయ్యప్ప స్వామి బొమ్మతో చెక్కిన బంగారు పెండెంట్లను అందించేందుకు తమిళనాడుకు చెందిన జీఆర్టీ జ్యువెలర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెలర్స్ టెండర్ దక్కించుకున్నాయి.
ఈ పెండెంట్లు 1 గ్రాము, 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల పరిమాణాలలో లభించనున్నాయి. ఏప్రిల్ 14న 'విషుక్కైనెట్టం' సందర్భంగా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఈ పెండెంట్లు కొనుగోలు చేయాలనుకునే భక్తులు ఏప్రిల్ 1 నుంచి www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని టీడీబీ వెల్లడించింది.
Details
శబరిమల ఆలయ పూజల రేట్ల పెంపు
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పూజల రేట్లను 30 శాతం పెంచాలని నిర్ణయించింది.
చివరిసారిగా 2016లో రేట్లను సవరించాం. ప్రతి ఐదేళ్లకోసారి రేట్లు సవరించే అధికారం హైకోర్టు బోర్డుకు ఇచ్చింది.
అయితే వరదలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత తొమ్మిదేళ్లుగా రేట్లను పెంచలేదు.
కానీ, నిత్యావసర వస్తువుల ధరలు మూడింతలు పెరిగినందున రేట్లు సర్దుబాటు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదని ప్రశాంత్ వివరించారు.
2016లో ఆలయ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం బోర్డు ఖర్చు రూ. 380 కోట్లు కాగా, 2025 నాటికి అది రూ. 910 కోట్లకు పెరిగిందని తెలిపారు.