CV Anand: పోలీసు శాఖలో కీలక మార్పులు.. రూ.90 కోట్లు ఆదా చేసిన పునర్‌వ్యవస్థీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణతో ప్రభుత్వానికి సుమారు రూ.90 కోట్లు ఆదా అయ్యాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వద్ద విధులు నిర్వహిస్తున్న 376 మంది సిబ్బందిని వెనక్కి రప్పించినట్లు వెల్లడించారు. అలాగే వారు వినియోగిస్తున్న వాహనాలను కూడా వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.90 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. అదేవిధంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో పనిచేస్తున్న 573 మంది సిబ్బందికి అదనంగా చెల్లిస్తున్న 60 శాతం మొత్తాన్ని ఉపసంహరించడం ద్వారా ఏడాదికి మరో రూ.28.16 కోట్లు ఆదా అవుతాయని డీజీపీ తెలిపారు.
వివరాలు
పదోన్నతులపై సమీక్ష
సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ ద్వారా అందుబాటులోకి వచ్చిన సిబ్బందిని అవసరాన్ని బట్టి ఇతర విభాగాల్లో వినియోగిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
పోలీసుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 'ఫిట్‌కాప్' కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఐజీ, ఆపైస్థాయి పోస్టులు మొత్తం 48 ఉండగా.. ప్రస్తుతం 24 మంది అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
డీఐజీ స్థాయిలో 11 పోస్టులు ఉండగా.. కొత్తగా మరో 10 పోస్టులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఈ పోస్టులను భర్తీ చేయాలంటే 1992, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.