Minister Narayana: రేరా నిబంధనలపై కీలక మార్పులు.. అనుమతుల ప్రక్రియ మరింత సులభం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని స్థిరాస్తి వ్యాపార రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 'రెరా' నిబంధనలను సులభతరం చేసే దిశలో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
రెరాలో పెండింగ్‌లో ఉన్న 167 దరఖాస్తులు నెలాఖరులోగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. విజయవాడలోని రెరా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 30 మంది దరఖాస్తుదారులు, బిల్డర్లు, డెవలపర్లు, క్రెడాయ్, నరెడ్కో ప్రతినిధులు హాజరయ్యారు. అనుమతుల జాప్యంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించి, అధికారులకు అవసరమైన ఆదేశాలిచ్చామని తెలిపారు.
Details
నగరపాలక సంస్థల కమిషనర్లకు ఆదేశాలు జారీ
రెరా అనుమతులను ఆఫ్‌లైన్ కాకుండా ఆన్‌లైన్‌లో అందించేలా మార్పులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు భవన, లేఅవుట్ల అనుమతులను సరళతరం చేస్తున్నామని చెప్పారు.
బిల్డర్లు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 822 టీడీఆర్ బాండ్లు నెలాఖరుకల్లా జారీ చేయాలని మంత్రి తెలిపారు.
వీటిలో 321 బాండ్ల పరిశీలన పూర్తయిందని, మిగతా 501 బాండ్లపై తక్షణమే పరిశీలన జరపాలని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, గుంటూరు, కాకినాడ, విజయవాడ, కడప, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల కమిషనర్లను ఆదేశించారు.
తణుకులో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ పూర్తయ్యాక, ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Details
కుమారస్వామిని కలిసిన టీజీ భరత్
రాష్ట్రంలో అనుమతుల్లేని లేఅవుట్లపై స్పష్టత వచ్చిందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి తర్వాత ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు కర్మాగారానికి ముడి ఖనిజం సరఫరా సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆ శాఖ కార్యదర్శిని టీజీ భరత్ దిల్లీలో సోమవారం కలిశారు.
ఈ పరిశ్రమకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిపై చర్చించారు. ప్రధాని మోదీ బుధవారం ఈ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు.