ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్ర హక్కు అందరికీ సమానంగా ఉంటుందని చెప్పింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా దీనికి అతీతం కాదని ధర్మాసనం చెప్పింది. ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్నవి తప్ప.. వాక్‌స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. 2016 జులైలో తన భార్య, కుమార్తె సామూహిక అత్యాచారానికి గురయ్యారని, ఈ కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. అయితే ఈసామూహిక అత్యాచారంపై యూపీకి చెందిన అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.
'ఆ బాధ్యత పార్లమెంట్‍దే'
ప్రజా జీవితంలో ఉన్న చట్ట సభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కలీశ్వరం రాజ్ ఈ సందర్భంగా ధర్మాసనం ఎదుట వాదించారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడి ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పదవులను కలిగి ఉన్న వ్యక్తులు స్వీయ నియంత్రణ విధించుకోవాలని చెప్పింది. ఒక మంత్రి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వ అభిప్రాయాలుగా పరిగణించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే మాట్లాడే విషయం విషయంలో స్వీయ నియంత్రణ ఉండాలని పేర్కొంది. వాక్ స్వాతంత్య్రం హక్కుపై అదనపు ఆంక్షలను తీసుకురావలసిన బాధ్యత పార్లమెంటుదేనని చెప్పింది.