AP Fibernet: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విధుల నుంచి 410 మంది తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ పాలనలో నియమితులైన ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో మొదటి విడతగా 410 మంది ఉద్యోగులను తొలగించగా, మరో 200 మందిని తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అర్హతలేని వారిని ఫైబర్‌నెట్‌లో నియమించిందని, కొంతమంది సిబ్బంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనులు చేసినట్లు ఆరోపించారు. వేతనాల పేరుతో ఫైబర్‌నెట్ నుంచి కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఫైబర్‌నెట్ దివాలా పరిస్థితికి చేరిందని స్పష్టం చేశారు.
ఆర్జీవీపై కేసు నమోదు
ఉద్యోగులను కక్షతో తొలగించడంలేదని, వారికి లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతున్నామని, అవసరమైతే తిరిగి నియమించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫైబర్‌నెట్ నుంచి ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి అక్రమంగా డబ్బులు చెల్లించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్జీవీకి 15 రోజుల గడువు ఇచ్చామని, గడువు ముగిసే లోపు డబ్బు చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.