AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు. అయోధ్య రామమందిరానికి కూడా కల్తీ లడ్డూలు సరఫరా చేయడం అత్యంత ఘోరమైన నేరమని మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. కల్తీ రసాయనాలతో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడాన్ని మహాపాపంగా అభివర్ణించింది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరో గుర్తించేందుకు ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పాల సేకరణ విషయంలో గతంలో అమలులో ఉన్న నిబంధనలపై కూడా మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
Details
పాలు సేకరించాలనే నిబంధనను తీసేశాం
రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థగా ఉండాలనే షరతు ఉందని తెలిపారు. అలాగే సంస్థ టర్నోవర్‌ను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించినట్లు చెప్పారు. పాలు సేకరించాల్సిందేనన్న నిబంధనను పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న భోలే బాబా డెయిరీకి వెళ్లిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా వైసీపీ పాలనలో 2022లో సిద్ధం చేసిన సీఆర్టీఐ నివేదికలోనే లడ్డూ కల్తీ విషయం స్పష్టంగా తేలినా, అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రివర్గం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సమయంలో పర్చేస్ కమిటీలో తాను, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సభ్యులుగా ఉన్నప్పటికీ, సమావేశానికి తమను ఆహ్వానించలేదని మంత్రి పార్థసారథి క్యాబినెట్ దృష్టికి తీసుకువచ్చారు.
Details
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
తమను పిలవకుండా పర్చేస్ కమిటీలో సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డి సమావేశాల్లో పాల్గొన్న విషయాన్ని కూడా మంత్రి పార్థసారథి వివరించారు. పర్చేస్ కమిటీలో సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే కమిటీలో లేని కరుణాకర్ రెడ్డి కలిసి నిబంధనలను సడలించి కల్తీకి తెరలేపారని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ స్పష్టం చేసింది.