Delhi Protests: దిల్లీ నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు.. రూబియో ఏమన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని దిల్లీలో గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలను అణచివేసేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్యసమితి (ఐరాస)కు చెందిన మానవ హక్కుల నిపుణుల బృందం ఇటీవల విమర్శించింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) తాజాగా స్పందించారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేస్తూనే, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నిరసనలు, రాజకీయ విభేదాలు సహజమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, రాజకీయ అంశాలపై భిన్నాభిప్రాయాలు వెల్లడించడం సాధారణమని రూబియో పేర్కొన్నారు.
వివరాలు
అభిప్రాయాల వ్యక్తీకరణ ఈ వ్యవస్థలో సర్వసాధారణం
ఈ సందర్భంగా అమెరికాలోనూ ప్రతిరోజూ నిరసనలు జరుగుతుంటాయని గుర్తుచేశారు. ''ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.
రాజకీయ విభేదాలు, ప్రజల అభిప్రాయాల వ్యక్తీకరణ ఈ వ్యవస్థలో సర్వసాధారణం. అమెరికా (USA)లోనూ ప్రతిరోజూ నిరసనలు జరుగుతాయి.
ఒక దేశంలో ప్రజలు బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారంటే.. అక్కడ రాజకీయ చర్చలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయని అర్థం'' అని మార్కో రూబియో వ్యాఖ్యానించారు.
వివరాలు
భారత ప్రభుత్వ చర్యలపై ఐరాస నిపుణుల విమర్శలు
దిల్లీలో యువత చేపడుతున్న నిరసనలను అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం మితిమీరిన బలప్రయోగానికి పాల్పడుతోందని, ఏకపక్షంగా నిర్బంధాలు చేపడుతోందని ఐరాసకు చెందిన 20 మంది మానవ హక్కుల నిపుణులు ఇటీవల ఆరోపించారు.
నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కూడా ఆ నిపుణులు కోరారు.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దిల్లీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి.
ఐరాస నిపుణుల బృందం చేసిన వ్యాఖ్యలపైనే తాజాగా మార్కో రూబియో స్పందించారు.
వివరాలు
జామ్‌నగర్‌కు మార్కో రూబియో.. రిలయన్స్ రిఫైనరీ సందర్శన
భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు.
అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించనున్నారు. భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఆ దేశం ఒక రిఫైనింగ్ సూపర్‌పవర్ అని రూబియో గతంలో కొనియాడారు.
ఈ నేపథ్యంలో ఆయన రిలయన్స్ రిఫైనరీని సందర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
వెనెజువెలా చమురు కోసం కొత్త మార్కెట్ల అన్వేషణ
వెనెజువెలా చమురును విక్రయించేందుకు అమెరికా కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న భారత్‌పై అగ్రరాజ్యం దృష్టి సారించింది.
మరోవైపు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
దీంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సామర్థ్యం కలిగిన భారత రిఫైనరీలు ఇంధన సరఫరాకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంలో ఉపయోగపడవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయంగా ఇంధన సరఫరా సమస్యలు, వెనెజువెలా చమురుకు కొత్త మార్కెట్ల అన్వేషణ కొనసాగుతున్న వేళ.. మార్కో రూబియో జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీని సందర్శించనుండటం ఆసక్తికరంగా మారింది.