LOADING...
Kaleshwaram: కాళేశ్వరం లోపాలపై కీలక నివేదిక.. మేడిగడ్డ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?
కాళేశ్వరం లోపాలపై కీలక నివేదిక.. మేడిగడ్డ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?

Kaleshwaram: కాళేశ్వరం లోపాలపై కీలక నివేదిక.. మేడిగడ్డ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన 700 పేజీల నివేదిక రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో వ్యవస్థపరమైన వైఫల్యాలు, అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అప్పుడు బాధ్యత వహించిన ముఖ్య నాయకులు, ఉన్నత అధికారులు, నిర్మాణ సంస్థల పాత్రలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. ఈ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదికను విశ్లేషణ చేయించారు. కమిటీ తమ అధ్యయనంలో ఎన్నో అవకతవకలు, సాంకేతిక లోపాలు, వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ దౌర్జన్యం స్పష్టంగా ఉన్నాయని సూచించినట్లు సమాచారం.

Details

నిర్మాణంలో బడా లోపాలు.. నిబంధనలు పక్కనపెట్టి నిర్ణయాలు

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌తోపాటు పలువురు ఐఏఎస్‌ అధికారులు, ఇంజినీర్ల పేర్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రాజెక్టులో అనుమతులు లేకుండా బడా నిర్ణయాలు తీసుకున్నట్టు, నీటి లభ్యత లేని ప్రాంతంలో బ్యారేజీలు నిర్మించారని, నిపుణుల నివేదికలను పక్కనపెట్టారని కమిషన్‌ పేర్కొన్నట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రభుత్వ నిర్ణయం కాదని, అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు స్వయంగా తీసుకున్న నిర్ణయాలు కావని, అవే నిర్ణయాలు బ్యారేజీల నష్టాలకు మూలమని నివేదిక స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Details

ఎల్ అండ్ టీ పాత్రపై తీవ్రమైన వ్యాఖ్యలు 

నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ, జాయింట్‌ వెంచర్‌ పీఈఎస్‌ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ పునర్నిర్మాణానికి తాము ఖర్చు చేస్తామని తొలుత చెప్పి, తర్వాత తమకు సంబంధం లేదని పేర్కొన్న సంస్థపై ఇప్పుడు క్రిమినల్ చర్యలు సూచించారు. డెఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌ ప్రకారం అన్ని లోపాల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని కమిషన్‌ స్పష్టం చేసింది. ఇకపోతే నిర్మాణ సంస్థలు ముందుకు వస్తాయా లేదా అన్నది ఉత్కంఠకు దారితీస్తోంది.

Details

వేల కోట్ల ప్రజాధన నష్టంపై వివరాలు 

కమిషన్ నివేదికలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైనట్టు, ఐఏఎస్‌ అధికారులు, సీనియర్‌ ఇంజినీర్లు, మాజీ సీఎంఓ సిబ్బంది కూడా బాధ్యులుగా ఉన్నారని పేర్కొనడంతో వ్యవస్థపై విశ్వాసం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ (KIPCL) బోర్డు సభ్యులు క్రిమినల్ బ్రీచ్‌ ఆఫ్ ట్రస్ట్‌ కింద కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం.

Details

 కమిషన్ కీలక సూచనలు

వాప్కోస్‌ సంస్థకు డీపీఆర్ తయారీకి ఇచ్చిన రూ. 6.77 కోట్లు తిరిగి వసూలు చేయాలని సూచన మేడిగడ్డ ఏడో బ్లాకును పూర్తిగా తొలగించి పునర్నిర్మించాలన్న సిఫార్సు ఎన్‌డీఎస్‌ఏ సూచన మేరకు మిగిలిన బ్లాకుల నాణ్యతపై పరీక్షలు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని స్పష్టమైన హితవు నిర్మాణ సంస్థలపై పూర్తి బాధ్యత వేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూచన

Details

కీలక నిర్ణయాల దశలో క్యాబినెట్‌ సమావేశం

ఆర్థిక అవకతవకలు, పద్ధతుల విరుద్ధంగా వ్యవహరించిన ప్రాజెక్టు అధికారులపై సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాతి చర్యలు సీఐడీకి అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.