LOADING...
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు.. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం
అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు.. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు.. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్‌ (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో కీలక దశ ఆరంభమైంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలవారీగా గెజిట్ నోటిఫికేషన్‌లు విడుదల చేస్తోంది. మొదటగా పల్నాడు జిల్లాకు సంబంధించిన మండలాలు, గ్రామాలు, సర్వే నంబర్లు, భూస్వాముల వివరాలతో అధికారిక గెజిట్‌ ప్రకటించారు. గెజిట్‌లో, ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ఈ సర్వే నంబర్లలోని భూములను స్వాధీనం చేసుకోనున్నట్టు '3ఏ నోటిఫికేషన్‌' రూపంలో స్పష్టంగా పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో ఉన్న 12 గ్రామాల భూసేకరణ వివరాలు అందులో ఉన్నాయి. త్వరలోనే ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ)అధికారులు ఈ గెజిట్‌ను పత్రికలలో ప్రకటన రూపంలో ప్రచురించనున్నారు. అదేవిధంగా, కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాల్లో కూడా కాపీలు అందుబాటులో ఉంచనున్నారు.

వివరాలు 

అభ్యంతరాలు ఉంటే, భూసేకరణ అధికారులకు 21 రోజుల్లో తెలియజేయాలి

భూములపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, భూసేకరణ అధికారులకు 21 రోజుల్లో తెలియజేయాలి. అందిన అభ్యంతరాలను పరిశీలించి, తదనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెలాఖరులో మిగతా జిల్లాల నోటిఫికేషన్లు అమరావతి ఓఆర్‌ఆర్‌ను 6-లేన్ల రహదారిగా మొత్తం 190 కి.మీ. పొడవున నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఓఆర్‌ఆర్‌లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో కాజా వరకు 17.5 కి.మీ. ఓ లింక్‌ రోడ్డు, నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కి.మీ. మరో లింక్‌రోడ్డు నిర్మిస్తారు. మొత్తం భూసేకరణ ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల పరిధిలో జరుగుతుంది.

వివరాలు 

గెజిట్‌లో గ్రామాల పేర్లు, సర్వే నంబర్లు, భూస్వాముల వివరాలు

పల్నాడు జిల్లా గెజిట్ విడుదల కాగా, ఏలూరు జిల్లా గెజిట్ ఈ వారంలో, మిగతా జిల్లాల గెజిట్‌లు ఈ నెలాఖరులోపు ప్రచురణ కానున్నాయి. గెజిట్‌లో గ్రామాల పేర్లు, సర్వే నంబర్లు, భూస్వాముల వివరాలు మాత్రమే ఉంటాయి. అయితే ప్రతి సర్వే నంబర్‌లో ఎంత భూమిని స్వాధీనం చేస్తారన్న వివరం క్షేత్రస్థాయిలో సర్వే చేసి పెగ్ మార్కింగ్ పూర్తి చేసిన తర్వాత ఖరారవుతుంది. ఆ వివరాలను ఆధారంగా '3డి నోటిఫికేషన్' జారీ చేస్తారు. కేంద్రం ఇప్పటికే అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్‌కు నిధులు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూసేకరణ తదుపరి దశగా 3డి నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమవుతోంది.

Advertisement