LOADING...
Tihar Jail: నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్‌ జైలును పరిశీలించిన యూకే బృందం!
నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్‌ జైలును పరిశీలించిన యూకే బృందం!

Tihar Jail: నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్‌ జైలును పరిశీలించిన యూకే బృందం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లు భారత్‌ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, యూకే అధికారుల బృందం ఇటీవల ఢిల్లీలోని తిహాడ్ జైలును పరిశీలించింది. జులైలో బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) బృందం జైలు సందర్శన జరిపిందని అధికారులు ధృవీకరించారు. ఈ సందర్భంగా జైలులోని భద్రతా ఏర్పాట్లు, ఖైదీలకు లభించే సౌకర్యాలను సమీక్షించారు.

Details

ఖైదీల భద్రతపై లిఖితపూర్వక హామీ

అంతేకాక, కొంతమంది ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. పరిశీలన అనంతరం తిహాడ్ జైలులో ఉన్న సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవేనని బ్రిటన్ అధికారులు అభిప్రాయపడ్డారని సమాచారం. అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని భారత జైలు అధికారులు వారికి వివరించారు. అదేవిధంగా ఖైదీల భద్రతపై లిఖితపూర్వక హామీని యూకే అధికారులు కోరినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో, పన్ను ఎగవేత, అక్రమ డబ్బు చలామణి కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త సంజయ్ భండారీ ఇటీవల లండన్ హైకోర్టులో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. భండారీని భారత్‌కు అప్పగిస్తే తిహాడ్ జైలులో ఉంచుతామని భారత అధికారులు ఇంతకుముందు నివేదించిన అంశాన్ని ప్రస్తావించారు.

Details

హింసకు గురయ్యే ప్రమాదం

అక్కడ ఆయన భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేసింది లండన్ హైకోర్టు. జైలులోని ఖైదీలు, అధికారుల చేతుల్లో బెదిరింపులు, దోపిడీ, హింసకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ కారణంగా బ్రిటన్ హోంమంత్రి జారీ చేసిన అప్పగింత ఉత్తర్వుల నుంచి విముక్తి కల్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే యూకే అధికారులు తిహాడ్ జైలును ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత్ వివిధ దేశాలకు అప్పగింత అభ్యర్థనలు పంపిన వారిలో మొత్తం 179 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 20 మంది యూకేలో ఉన్నారని తెలుస్తోంది. వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీతో పాటు పలువురు ఖలిస్థానీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి.