Khammam Hi-tech Highway : తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ హైవే.. త్వరలో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే కీలక ప్రాజెక్టుగా ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మితమైన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నాలుగు లేన్లతో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలపై ఈ రహదారి రూపుదిద్దుకుంది. సీసీ కెమెరాలు,సౌర శక్తితో పనిచేసే దీపాలు,సమాచారం కోసం క్యూఆర్ కోడ్ బోర్డులు,అత్యవసర పరిస్థితుల కోసం మీడియన్ ఓపెనింగ్స్,ఆధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఈ హైవేకి ఉన్నాయి. ప్రయాణించిన దూరాన్ని ఆధారంగా చేసుకుని టోల్ వసూలు చేసే విధానం,పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశ-నిష్క్రమణ కేంద్రాలు ఉండటం దీని ప్రత్యేక లక్షణాలు. ఇప్పటివరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి ఏదీ లేకపోవడంతో ఇదే మొదటిది కానుంది.
వివరాలు
162.04 కిలోమీటర్ల పొడవుతో ఈ రహదారి నిర్మాణం
మే నెలలో దీన్ని ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సన్నాహాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నప్పటికీ, వీటిలో ముందుగా పూర్తవుతున్న ప్రాజెక్ట్ ఇదే. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు మొత్తం 162.04 కిలోమీటర్ల పొడవుతో ఈ రహదారి నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరాలంటే సూర్యాపేట, విజయవాడ మార్గంగా సుమారు 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కొత్త హైవే అందుబాటులోకి వస్తే ఈ దూరం దాదాపు 56 కిలోమీటర్లు తగ్గుతుంది.
వివరాలు
నాగ్‌పూర్-అమరావతి హైవేతో అనుసంధానించే మార్గం
ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ప్రారంభమై,ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాల గుండా దేవరపల్లి వరకు సాగిన ఈ మార్గానికి ఎన్‌హెచ్-365బీజీగా సంఖ్య కేటాయించారు. మొత్తం నిర్మాణ వ్యయం రూ.4,451.87 కోట్లు. తెలంగాణ పరిధిలోని ప్యాకేజీ-1లో ఒక వంతెన,ఒక ఆర్వోబీ (బో స్ట్రింగ్ గిడ్డర్) పనులు చివరి దశలో ఉండగా,మిగతా పనులన్నీ పూర్తయ్యాయి. ఈ హైవేపై 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, ఒక ఆర్వోబీ, 98 అండర్‌పాస్‌లు నిర్మించారు. ఖమ్మం జిల్లా వందనం గ్రామం వద్ద ఈ రహదారిని నాగ్‌పూర్-అమరావతి హైవేతో అనుసంధానించే మార్గం కూడా అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్‌ను తెప్పించి నిర్మాణంలో వినియోగించారు.
వివరాలు
ఈ హైవేపై భద్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా వాహనం ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 'భారతమాల పరియోజన'లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును మరో రెండు నుంచి మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య ఖమ్మంలో మీడియాకు వెల్లడించారు. ఈ హైవేపై భద్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఐదు ప్రాంతాల్లో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా రహదారిపై జరిగే ప్రతి కదలికను పర్యవేక్షిస్తారు. ప్రమాదం జరిగినా,వాహనం అతివేగంగా నడిపినా,సీటుబెల్ట్ ధరించకపోయినా,రాంగ్‌రూట్‌లో ప్రయాణించినా వెంటనే సమాచారం సంబంధిత అధికారులకు చేరుతుంది.
వివరాలు
త్త హైవేపై ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక 360డిగ్రీల సీసీ కెమెరా
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా చలాన్లు జారీ చేస్తారు.అదేవిధంగా ఏటీఎంఎస్ ద్వారా వాతావరణ సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాతీయరహదారుల్లో ముఖ్య కూడళ్ల వద్ద మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి. అయితే ఈ కొత్త హైవేపై ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక 360డిగ్రీల సీసీ కెమెరాను అమర్చారు. ఇవి రహదారి రెండు వైపులా దాదాపు ఒక కిలోమీటరు పరిధిలోని దృశ్యాలను రికార్డు చేస్తాయి. సోలార్ ఆధారిత దీపాలను ఏర్పాటు చేయగా,వాటి బ్యాటరీలకు 12గంటల వరకు బ్యాక్‌అప్ ఉంటుంది.సాయంత్రం అవ్వగానే ఇవి స్వయంచాలకంగా వెలిగేలా సిస్టమ్ అమర్చారు. ఈ రహదారిపై సాధారణ హైవేల మాదిరిగా అనేక ప్రవేశ మార్గాలు ఉండవు. మొత్తం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
వివరాలు
హోటళ్లు, పెట్రోల్‌బంకులు, వాష్‌రూములు తదితర సౌకర్యాలు
అంటే సగటున ప్రతి 18 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు సులభం కావడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 50 కిలోమీటర్లకు రహదారి రెండు వైపులా ఐదేసి ఎకరాల విస్తీర్ణంలో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ హోటళ్లు, పెట్రోల్‌బంకులు, వాష్‌రూములు తదితర సౌకర్యాలు ఉంటాయి. హైవేపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డులను స్కాన్ చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రదేశం,సమీపంలోని పోలీస్ స్టేషన్,పెట్రోల్‌బంక్ వంటి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఇలా అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థకు కొత్త దిశను నిర్దేశించనుంది.