వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటంరెడ్డితో పాటు ఆయన ఇద్దరు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌లు 448, 363 సెక్షన్ల కింద కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదయ్యాయి.
నన్ను కారులో బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు: విజయ్ భాస్కర్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో టీడీపీలోకి వెళ్తానని కోటంరెడ్డి హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో తన ఆఫీసులోని ఎమ్మెల్యే ఫొటోను వైసీపీకి చెందిన కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి తొలగించారు. ఇదే సమయంలో కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఎమ్మెల్యే అనుచరులు తనను బలవంతంగా కారులో ఎక్కించే ప్రయత్నం చేశారని, తాను వారిని ప్రతిఘటించి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అంతు చూస్తామని ఎమ్మెల్యే అనుచరులు బెదరించారని విజయ్ భాస్కర్ రెడ్డి వివరించారు.