ఫోన్ ట్యాపింగ్: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరువర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి. ఇదే అదును అన్నట్లుగా టీడీపీ కూడా ట్యాపింగ్ వ్యవహారంపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఈవిషయంపై కేంద్రం జోక్యం చేసుకొని విచారణ జరపాలని ఏకంగా ప్రధానికే లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ వ్యవహారంపై మోదీ జ్యోక్యం చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే ఎవరికి అనుకూలంగా ఉంటారనేది ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీతో సమదూరాన్ని పాటిస్తున్న మోదీ, ప్రత్యేకంగా ఈ వ్యవహారంలో కలగజేసుకోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబే మ్యాన్ ట్యాపింగ్ చేశారు: కాకాణి
తన ఫోన్ ట్యాపింగ్ చేరారని కోటంరెడ్డి అంటుంటే, ఆ అవసరం తమకు లేదని వేసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సజ్జలపై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. సజ్జల తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండి పడ్డారు. తన నోరు మూయలేరని, అది జరగాలంటే తనను ఎన్ కౌంటర్ చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు వైసీపీపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవానికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని, టీడీపీ అధినేత చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కోటంరెడ్డిని ప్రశ్నించారు.