'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పోలీసు, ఇంటెలిజెన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన తర్వాత అదే జిల్లాకు చెందిన మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొంతకాలంగా తనపై నిఘా పెట్టినట్లు బాగా తెలుసని ఈ సందర్భంగా కోటంరెడ్డి స్పష్టం చేశారు. అందుకే వేరే వాళ్ల ఫోన్లు వాడుతున్నట్లు చెప్పారు.
నా విలేకరుల సమావేశాలకు ముగ్గురు ఇంటెలిజెన్స్ సిబ్బంది హాజరవుతున్నారు: కోటంరెడ్డి
గత మూడు నెలలుగా నా విలేకరుల సమావేశాలకు ముగ్గురు ఇంటెలిజెన్స్ సిబ్బంది హాజరవుతున్నట్లు ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. తన సంభాషణల వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. తాను ఎవరినైనా బహిరంగంగానే విమర్శిస్తానని స్పష్టం చేశారు. తన నియోజక వర్గంలో మురుగు నీటి కాలువ సమస్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. అలాగే తన నియోజకవర్గంలో పింఛన్ల కోతపై కూడా అధికారులపై శ్రీధర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. సొంత పార్టీకి చెందిన నాయకులే తనను బలహీన పర్చడానికి కుట్ర పన్నుతున్నారని ఇటీవల ఆయన ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి చేస్తున్న అనుమానాస్పదంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.