LOADING...
Kidney Rocket: ఏపీలో కిడ్నీ రాకెట్‌ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు! 
ఏపీలో కిడ్నీ రాకెట్‌ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు!

Kidney Rocket: ఏపీలో కిడ్నీ రాకెట్‌ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో భారీ కిడ్నీ రాకెట్‌ బయటపడింది. ఈ రహస్య దందా ఒక మహిళ ప్రాణం కోల్పోవడంతో బహిర్గతమైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపి, పలువురిని అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ డాక్టర్‌ ఆంజనేయులు కోడలు డాక్టర్‌ శాశ్వతి గ్లోబల్‌ ఆస్పత్రిని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌లో మదనపల్లెలోని డయాలసిస్‌ సెంటర్‌ మేనేజర్‌ బాలు, పుంగనూరుకు చెందిన డయాలసిస్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ నాయక్‌ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్‌ శాశ్వతి నేతృత్వంలో ఈ గ్యాంగ్‌ కిడ్నీ మార్పిడి దందాను ప్రణాళికాబద్ధంగా సాగించినట్లు విచారణలో తేలింది.

Details

రూ.8 లక్షలకు ఒప్పందం

డయాలసిస్‌ సెంటర్‌లకు వచ్చే ధనవంతులైన రోగులను టార్గెట్‌ చేసి, వారికి కొత్త కిడ్నీలు మార్పిడి చేయిస్తామని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేశ్‌ సంప్రదించారు. కిడ్నీ ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం మదనపల్లెలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయగా, ఈ నెల 9న శస్త్రచికిత్స సమయంలో యమునకు మూర్చ రావడంతో ఆమె మరణించింది. యమున మృతి తర్వాత ఆస్పత్రి నిర్వాహకులు ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని తిరుపతి మార్గంగా విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Details

పోలీసుల అదుపులో మేనేజర్

అయితే సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచి 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి పోలీసులు ఈ సమాచారాన్ని మదనపల్లె టూ టౌన్‌ పోలీసులకు అందజేయగా, వారు వెంటనే గ్లోబల్‌ ఆస్పత్రిపై దాడి చేశారు. అక్కడే డయాలసిస్‌ సెంటర్‌ మేనేజర్‌ బాలు, పుంగనూరుకు చెందిన వెంకటేశ్‌ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు బ్రోకర్లు—సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనతో మదనపల్లె వైద్యవర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. కిడ్నీ మార్పిడి రాకెట్‌ వెనుక మరెంత పెద్ద నెట్‌వర్క్‌ ఉందనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.