Mumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్ గ్రౌండ్ మెట్రో.. ప్రత్యేకతలివే
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ముంబై పర్యటనకు వెళ్లి అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అందులో ముఖ్యంగా ముంబైలోని తొలి భూగర్భ మెట్రో ప్రాజెక్ట్ - మెట్రో త్రీ ప్రాజెక్ట్ ప్రారంభం జరగనుంది. ఇది ఆక్వా లైన్ మొదటి దశలో భాగం. ఆరే కాలనీ నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు 12 కిలోమీటర్ల మార్గాన్ని విస్తరించనున్నారు. మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, అలాగే ముంబై నుండి నాగ్‌పూర్‌కు వెళ్ళే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు.
రోజుకి సుమారు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం
అదనంగా, థానే రింగ్ మెట్రో ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెట్రో విస్తరణలో 10 కొత్త స్టేషన్లు ఉండబోతున్నాయి. మొత్తం కారిడార్ పొడవు 33.5 కిలోమీటర్లుగా ఉండనుంది. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టవచ్చని అంచనా. ఈ మార్గంలో మెట్రో ప్రారంభమైతే, రోజుకి సుమారు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే, ఈ మెట్రో ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకోవడం సులభం అవుతుంది. ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుందనీ, నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ ప్రాంతాల నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చని సమాచారం.