LOADING...
Greenfield Highway : 6-7 గంటల్లోనే బెంగళూరుకు ప్రయాణం
6-7 గంటల్లోనే బెంగళూరుకు ప్రయాణం

Greenfield Highway : 6-7 గంటల్లోనే బెంగళూరుకు ప్రయాణం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 28, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్-544జీ) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ లేదా జులై నాటికి ఈ ఆరు లేన్ల జాతీయ రహదారిని వాహనాల రాకపోకలకు సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొని పనులను ముమ్మరం చేశారు. ఈ ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) "బెంగళూరు-కడప-విజయవాడ (బీకేవీ) ఎకనామిక్ కారిడార్"గా అభివర్ణిస్తోంది. బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని కోడూరు వరకు ప్రస్తుతం ఉన్న బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపైనే సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

వివరాలు

కేవలం 7 గంటల్లోనే ప్రయాణం పూర్తి..

కోడూరువద్ద ప్రారంభమయ్యే యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 343.24 కిలోమీటర్ల మేర విస్తరించి, ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడి నుంచి మరో 115 కిలోమీటర్లు ప్రయాణిస్తే విజయవాడ చేరుకోవచ్చు. అంటే మొత్తం ప్రయాణంలో మధ్య భాగంలో 343.24 కిలోమీటర్ల మేర కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉండగా, ప్రారంభం, చివరి భాగాల్లో కలిపి ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులపై సుమారు 225 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోవడానికి సాధారణంగా 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అదే ప్రయాణాన్ని కేవలం 6 నుంచి 7 గంటల్లో పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుంది.

వివరాలు

పనుల పురోగతి..

శ్రీసత్యసాయి జిల్లాలో ఈ రహదారి చిలమత్తూరు, గోరంట్ల, ఓడీసీ, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ ప్రాంతాల మీదుగా సాగి, తలుపుల మండలంలోని నామాలగుండు వద్ద వైఎస్సార్ కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలోని సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో 60 శాతానికి పైగా నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పుట్టపర్తి మండలంలోని సాతర్లపల్లి పరిసరాల్లో కొండను తొలిచే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ, అవి నెమ్మదిగా సాగుతున్నాయి. నల్లమాడ నుంచి మలకవేముల క్రాస్ వరకు సుమారు 15 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. మలకవేముల క్రాస్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం కొనసాగుతుండగా, అక్కడి నుంచి కొండగట్టుపల్లి వరకు బిటుమిన్ (బీటీ) లేయర్ వేస్తున్నారు.

Advertisement

వివరాలు

13వ ప్యాకేజీలో రహదారి పనులు పూర్తి..

వైఎస్సార్ కడప జిల్లాలో ఈ హైవే వేముల, పులివెందుల, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, పోరుమామిళ్ల ప్రాంతాల మీదుగా వెళ్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ హైవే అత్యధికంగా సుమారు 140 కిలోమీటర్ల మేర విస్తరించింది. సింగరాయకొండ నుంచి మైదుకూరు వైపు వెళ్లే ఎన్‌హెచ్-167బీ వద్ద ఇంటర్‌చేంజ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే, మర్రిపూడి నుంచి సోమవరప్పాడు వరకు ఉన్న 13వ ప్యాకేజీలో రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5.31 కిలోమీటర్ల పొడవుతో ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. వీటిలో నెల్లూరు జిల్లా సీతారామపురం మండల సరిహద్దులో నిర్మిస్తున్న 3.67 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఈ ప్రాజెక్టులోనే అతిపెద్దది.

Advertisement