జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది. ఉమ్మడి ఓటరు గుర్తింపు కార్డు, ఓటర్ల జాబితా, అవసరమైన సవరణలతో ఎలా ముందుకెళ్లాలన్న రోడ్‌మ్యాప్‌పై చర్చించినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి లా కమిషన్, జాతీయ, రాష్ట్ర పార్టీల నుంచి సలహాలను తీసుకోవాలని ప్యానెల్ నిర్ణయించింది. అమిత్ షా, గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చీఫ్ ఎన్‌కే సింగ్‌లు, లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రాజ్యంగంలోని కొన్ని నిబంధలను సవరించే అవకాశం
జమిలి ఎన్నికలను అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఇతర చట్టాలు, నిబంధనలకు కొన్ని సవరణలను పరిశీలించి, సిఫారసు చేయనుంది. ఒకవేళ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో దశల వారీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించిన కాలవ్యవధి ఎంత ఉండాలనే దానిపై ప్యానెల్ నిర్దిష్టమైన సూచనలు చేయనుంది. హంగ్ ఏర్పడినప్పుడు మధ్యలోనే ప్రభుత్వాలు రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితులకు సంబంధించి పరిష్కారాలను కూడా కమిటీ సూచించాల్సి ఉంటుంది. ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పేపర్-ట్రయిల్ మెషీన్లు, పోలింగ్, భద్రతా సిబ్బంది అవసరం కాబట్టి లాజిస్టిక్స్ సమస్యపై కూడా ప్యానెల్ చర్చించే అవకాశం ఉంది.