El Niño: శ్రీశైలం,తుంగభద్రలో పెరుగుతున్న నీటిమట్టం.. అన్నదాతల్లో ఆశలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంటుందనే ఆందోళనలో ఉన్న రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో పెరుగుతున్న నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న విస్తార వర్షాల కారణంగా శ్రీశైలం, తుంగభద్రతో పాటు ఇతర జలాశయాలకు గణనీయంగా వరద నీరు చేరుతోంది. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 85.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదే ప్రవాహం కొనసాగితే మంగళవారానికల్లా నిల్వలు 100 టీఎంసీల మార్కును చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 1,60,537 క్యూసెక్కుల వరద ప్రవాహం జలాశయంలోకి చేరుతోంది.
వివరాలు
70 వేల క్యూసెక్కులకు తుంగభద్ర
ఆలమట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుకుండలా ఉండటంతో అక్కడి నుంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర జలాశయంలో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 44.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నదీ పరివాహక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా శృంగేరి వద్ద తుంగానదిపై ఉన్న అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ నీరు తుంగభద్రలోకి చేరడంతో జలాశయంలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
సోమవారం ఉదయం సుమారు 40 వేల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం సాయంత్రానికి 70 వేల క్యూసెక్కులకు చేరుకుంది.
వివరాలు
ఆలమట్టి,నారాయణపూర్‌లో భారీ ప్రవాహం
దీంతో రోజుకు సుమారు ఆరు టీఎంసీల వరకు నీటి నిల్వలు పెరుగుతున్నాయి.
ఈ నీటి సంవత్సరంలో ఆలమట్టి జలాశయంలోకి ఇప్పటివరకు 178.87 టీఎంసీల నీరు చేరింది.
పూర్తి నిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు అయినప్పటికీ ప్రస్తుతం 111.97 టీఎంసీల మేర మాత్రమే నిల్వ ఉంచి,మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ జలాశయంలోకి ఇప్పటివరకు 92.22 టీఎంసీల నీరు చేరింది. దీని పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 29.49 టీఎంసీల నీటిని నిల్వ చేసి మిగిలిన ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు.
తెలంగాణలోని జూరాల జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, అదనపు ప్రవాహాన్ని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు.
వివరాలు
గోదావరిలో తొలుత కష్టాలు.. ఇప్పుడు పరిస్థితి మెరుగుదల
ఈ ఏడాది గోదావరి నదిలో ఖరీఫ్ ప్రారంభంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
సాధారణంగా ఈ కాలంలో గోదావరి డెల్టాకు నీటి కొరత ఏర్పడటం అరుదుగా కనిపిస్తుంటుంది.
అయితే ఈసారి జులై తొలి రోజుల్లో గోదావరిలో ప్రవాహం తగ్గిపోవడంతో సీలేరు నుంచి బైపాస్ ద్వారా నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరగడం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసే అవకాశం ప్రస్తుతం పరిమితంగానే ఉంది.
కాటన్ బ్యారేజీ వద్ద కేవలం 2.93 టీఎంసీల వరకు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి జలాలను మరింతగా నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు.
వివరాలు
ఏలేరు జలాశయంలో ప్రస్తుతం 8.62 టీఎంసీల నీరు
ప్రస్తుతం గోదావరిలో వస్తున్న వరద నీటిని వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగిస్తున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 14.46 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించారు.
అదే సమయంలో కాటన్ బ్యారేజీని దాటి సుమారు 306 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది.
ఇక ఏలేరు జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.62 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి వరద జలాలను ఏలేరు జలాశయానికి మళ్లిస్తూ నిల్వలను పెంచే చర్యలు కొనసాగుతున్నాయి.