Loading...
Krishna Water Dispute: కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా
కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా

Krishna Water Dispute: కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా జలాల వినియోగంపై సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. నీటి వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బోర్డు మెంబర్‌ సెక్రటరీ, కమిటీ కన్వీనర్‌ సతీష్‌ కాంబోజ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి సభ్యులుగా పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే నీటి కేటాయింపులు, ఇప్పటికే జరిగిన వినియోగం, భవిష్యత్‌ అవసరాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమావేశంలో తొలుత శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోని ప్రస్తుత నీటిమట్టాలు, వాటికి వస్తున్న ప్రవాహాలపై చర్చించారు.

వివరాలు 

పంచాయితీ ఇలా..

అక్టోబరు వరకు ఏపీలోని పలు ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆ రాష్ట్రం కోరింది.

దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని తరలిస్తోందని, ప్రస్తుతం కూడా 8 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోందని పేర్కొంది.

శ్రీశైలం కుడి కాలువకు 19 టీఎంసీలు, చెన్నై తాగునీటి అవసరాలకు మరో 15 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయని తెలంగాణ తెలిపింది.

ఈ నీటిని కూడా జులై నుంచి అక్టోబరు మధ్యకాలంలోనే వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

అంతకు మించి నీటిని తీసుకెళ్లడానికి అవకాశం లేదని, సాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించరాదని స్పష్టం చేసింది.

వివరాలు 

పంచాయితీ ఇలా..

దీనిపై ఏపీ తీవ్రంగా స్పందించింది. ఎన్‌ బ్లాక్‌ కేటాయింపుల్లో భాగంగా తమకు కేటాయించిన నీటిని ఎక్కడి నుంచైనా తీసుకెళ్లే హక్కు ఉందని పేర్కొంది.

నీటిని ఎలా తీసుకోవాలో తమను ప్రశ్నించడం సరికాదని వాదించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం నీటిని పంపిణీ చేయాల్సి వస్తే ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం చొప్పున కేటాయించాలని ఏపీ కోరింది.

అక్టోబరు వరకు తమకు 47 టీఎంసీల నీటిని ఇవ్వాలని మరోసారి స్పష్టం చేసింది.

శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా నీటిని వినియోగిస్తోందని ఏపీ ఆరోపించింది.

జలాశయంలో నీటిమట్టం 840 అడుగులకు దిగువకు పడిపోతే తమకు నీటిని తరలించడం కష్టమవుతుందని అభ్యంతరం తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

పంచాయితీ ఇలా..

దీనిపై తెలంగాణ స్పందిస్తూ.. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని ఇష్టానుసారంగా తరలించడం సాధ్యం కాదని పేర్కొంది.

ఏపీ కోరుతున్న విధంగానే తమకూ నీటిని కేటాయించాలని పట్టుబట్టింది.

పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే ఏపీ ఎక్కువ నీటిని వినియోగించుకుందని, ఇక ఆ రాష్ట్రానికి అదనంగా నీరు ఇవ్వడానికి అవకాశం లేదని వాదించింది.

నాగార్జునసాగర్‌లో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరిన పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నీటిని తీసుకునే అవకాశం తమకు ఉందని తెలంగాణ స్పష్టం చేసింది.

రెండు రాష్ట్రాలు తమ వాదనలపై వెనక్కి తగ్గకపోవడంతో నీటి పంపకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు.

ADVERTISEMENT

వివరాలు 

50 శాతం చొప్పున ఇవ్వాలని చెప్పాం: తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బాబు

కృష్ణానదిపై ఉన్న రెండు ప్రధాన జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని ఏపీ, తెలంగాణకు 50 శాతం చొప్పున కేటాయించాలని తాము కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బాబు తెలిపారు.

ఎల్‌నినో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు.

పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తోందని బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

భవిష్యత్‌లో కృష్ణా నదికి కొత్తగా నీటి ప్రవాహాలు వస్తే.. ఆ తర్వాత నీటి వినియోగంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

సెప్టెంబరు 4న జరిగే సమావేశంలో తాగునీటి అవసరాలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు 

రెండు రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదు: ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పరిధిలోని నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు.

అక్టోబరు వరకు ఏపీకి 47 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరినట్లు చెప్పారు. అయితే ఏడాది మొత్తానికి సంబంధించిన నీటి వినియోగంపై తెలంగాణ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.

సమావేశంలో నీటి వినియోగానికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ.. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు ఉన్న వాటాల అంశం మాత్రం చర్చకు రాలేదని స్పష్టం చేశారు.

సెప్టెంబరు 4న మరోసారి సమావేశమై తాగునీటి అవసరాల కోసం నీటి వినియోగాన్ని ఖరారు చేస్తామని నరసింహమూర్తి తెలిపారు.

ADVERTISEMENT