Kurnool: కర్నూలులో ఘోర బస్సు అగ్నిప్రమాదం..20 మందికి పైగా మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు, శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి-44పై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు బస్సులోనే కాలిపోయి మృతి చెందగా, మరికొందరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం ప్రకారం, ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో సుమారు 39 మంది ఉన్నారు. వీరిలో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా, 20 మందికి పైగా మృత్యువాత పడ్డారని ప్రాథమిక వివరాలు తెలియజేస్తున్నాయి.
వివరాలు
ప్రమాదం ఎలా జరిగిందంటే
బస్సు ఉలిందకొండ ప్రాంతానికి చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న ఒక ద్విచక్రవాహనం బస్సును ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకు వెళ్లి ఇంధన ట్యాంక్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలు గమనించి బయటపడేందుకు ప్రయత్నించారు. కొందరు సురక్షితంగా బయటపడగలిగారు,అయితే పలువురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్లో గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల్లో అధికంగా హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా,ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారైనట్లు సమాచారం.
వివరాలు
ప్రాణాలతో బయటపడిన వారు వీరే..
రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం వంటి 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హిందూపూర్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి ఆరుగురు గాయపడిన వారిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న హైమ రెడ్డి బస్సులో మంటలు ఎగసిపడుతుండగా గమనించి ఆగి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సమాచారంతో పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు.