వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేతులు కలిపారు. విశాఖపట్నంలో బుధవారం వారిద్దరూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వారితో చేతులు కలుపుతున్నట్లు లక్ష్మీ నారాయణ తెలిపారు. తాను కూడా స్టీల్ ప్లాంట్‌కోసం ఉద్యమిస్తున్నట్లు కేఏ పాల్ వివరించారు. భవిష్యత్తులో ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం డ్రామా ఆడుతోందని కేఏ పాల్ విమర్శించారు. తాను 20 నుంచి 30 సార్లు ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిశానని పాల్ చెప్పారు. ఈ విషయంలో లక్ష్మీనారాయణకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
సెయిల్‌ను ప్రోత్సహిస్తూనే విశాఖ ఉక్కును అమ్ముతారా: లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు సామర్థ్యం 7.3మిలియన్ టన్నులు, దేశం మొత్తం 122 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉందన్నారు. విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని 173మిలియన్ టన్నులకు పెంచుకోవాలని ఆయన అన్నారు. సెయిల్‌లోని స్టీల్ ప్లాంట్‌ల సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఒకవైపు కేంద్రం చేతిలో ఉన్న సెయిల్‌ను ప్రోత్సహిస్తూనే విశాఖ ఉక్కును అమ్ముతోందని ప్రశ్నించారు. సెయిల్ కింద వైజాగ్ స్టీల్‌ను కూడా ప్రోత్సహిస్తే దాని సామర్థ్యాన్ని 7.3 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులకు పెంచుకోవచ్చని చెప్పారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓ ప్రైవేట్ కంపెనీ తరపున విశాఖ ఉక్కుకోసం బిడ్ వేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అవసమైన మూలధనాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.