Lalit Modi: 'పలాయనవాదులు' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన లలిత్ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. ఇటీవల లండన్‌లో విజయ్ మాల్యాతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో తాము తాము అతిపెద్ద పలాయన వాదులమంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దేశాన్ని మోసం చేసి విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా భారత్‌ను బహిరంగంగా అవమానిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
భారత ప్రభుత్వంపై నాకు ఎంతో గౌరవం: లలిత్ మోదీ
ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన లలిత్ మోదీ, తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారత ప్రభుత్వంపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా,బ్యాంకుల మోసం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ నుంచి పారిపోయి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా ఇటీవల తన 70వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆ వేడుకకు హాజరైన లలిత్ మోదీ, మాల్యాతో కలిసి వీడియో చిత్రీకరిస్తూ తాము అతిపెద్ద పలాయనవాదులమని వ్యాఖ్యానించారు.
వివరాలు
లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా ఎగెయిన్
అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా ఎగెయిన్" అనే క్యాప్షన్ కూడా జత చేశారు. లలిత్ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశం నుంచి పారిపోయిన ఈ ఇద్దరు నిందితులను భారత్‌కు తీసుకురావడానికి బ్రిటన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.