YouTuber: యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు.. లాంబోర్గినీ, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు సీజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ నివాసిత యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఆ సోదాల్లో అతని ఇంట్లో లగ్జరీ కార్లు ఉన్నట్లు గుర్తించారు.లాంబోర్గినీ ఉరుస్, బీఎండబ్ల్యూ జెడ్4, మెర్సిడీజ్ బెంజ్ వంటి మొత్తం నాలుగు లగ్జరీ కార్లను ఈడీ సీజ్ చేసింది. ఈడీ ప్రకారం, ద్వివేది ఆన్‌లైన్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ యాప్‌ల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం పొందాడు. అతని గ్యారేజీలోని లగ్జరీ కార్లను చూసిన ఈడీ అధికారులు షాక్ అయ్యారు. గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్ ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బులను ద్వివేది ఖరీదైన కార్లను కొనుగోలు చేయడానికి వాడినట్లు వెల్లడైంది. ప్రమాదకరమైన నిధుల క్రమాన్ని విశ్లేషించిన ఈడీ, స్కై ఎక్స్‌చేంజ్,వివిధ గ్యాంబ్లింగ్ యాప్‌ల ద్వారా అతను డబ్బులు సేకరించినట్లు గుర్తించింది.
వివరాలు
ఈ నెట్వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఈడీ విచారణ
ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులను మనీ లాండరింగ్ చేయించి,తర్వాత ఖరీదైన కార్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈచర్యలతో పీఎంఎల్ఏ చట్టం కింద అతనిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అనురాగ్ ద్వివేది తన యూట్యూబ్ ఛానెల్లో బెట్టింగ్,గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ ప్రచారం చేశాడు. దానివల్ల,అతని ఛానెల్ ఫాలోవర్స్ అనేక మంది ఆ యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించుకున్నారు. దీని ద్వారా అతను అక్రమ కార్యకలాపాల్లో పాల్పడినట్టు ఈడీ తెలిపింది. ఇక,ఈ నెట్వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఈడీ విచారణ చేపట్టింది.అలాగే అక్రమంగా సంపాదించిన మొత్తం, పెట్టుబడులు ఎంత అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో,మరికొంత మంది వ్యక్తుల ఆస్తులను కూడా సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.