Page Loader
Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!
పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి, కశ్మీర్‌ నుంచి పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ ఈ దాడికి సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టంచేసింది. ఈ కుట్రకు లష్కరే తోయిబా సంస్థకు చెందిన కమాండర్‌ ఫరూఖ్‌ అహ్మద్‌ తేడ్వా కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవలే భద్రతా బలగాలు అతడి స్వస్థలమైన కుప్వారాలోని ఇంటిని పేల్చివేశాయి. గత రెండు సంవత్సరాల్లో కశ్మీర్‌ లోయలో జరిగిన అనేక ఉగ్రదాడులకు అతడు సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

వివరాలు 

పాకిస్తాన్‌, భారత్ మధ్య పలుమార్లు ప్రయాణించిన రికార్డులు

ఫరూఖ్‌కు కశ్మీర్‌లోని పర్వతాలు, లోయల్లో దారి మార్గాలపై పూర్తి అవగాహన ఉంది. భారత్‌లోకి ఉగ్రవాదులను చొరబడించేందుకు అతడు మూడురకాల మార్గాలను వినియోగించి సాయం చేశాడు. పాకిస్తాన్‌లో అతడికి బలమైన సంబంధాలు ఉండటంతో, 1990 నుంచి 2016 మధ్యకాలంలో పాకిస్తాన్‌, భారత్ మధ్య పలుమార్లు ప్రయాణించిన రికార్డులు ఉన్నాయి. పహల్గాం దాడి అనంతరం అతడికి సహకరించిన అనేకమందిని అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పాక్‌లో తలదాచుకున్న ఫరూఖ్‌ తన కశ్మీర్‌ నెట్‌వర్క్‌తో సంబంధాలు కొనసాగించేందుకు సురక్షిత కమ్యూనికేషన్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్టు సమాచారం.

వివరాలు 

ఉగ్రవాదుల వద్ద ప్రత్యేక యాప్‌లు, అల్ట్రాసెట్లు   

పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సాధారణంగా పర్వతారోహకులు ట్రెక్కింగ్ కోసం ఉపయోగించే 'ఆల్పైన్ క్వెస్ట్‌' అనే నావిగేషన్ యాప్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లో వాడినట్లు భావిస్తున్నారు. ఈ యాప్ వినియోగం వల్ల వారి స్థానాన్ని గుర్తించడం భద్రతా బలగాలకు కష్టతరమయ్యింది. అంతేకాకుండా, ఉగ్రవాదుల వద్ద అల్ట్రాసెట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. 2023 నుంచి కశ్మీర్‌లో ముష్కరులు వీటిని వినియోగిస్తున్నారు. ఈ అల్ట్రాసెట్లు సాధారణ జీఎస్ఎం, సీడీఎంఏ మొబైల్‌ ఫోన్ల మాదిరిగా కాకుండా, ప్రత్యేకమైన రేడియో నెట్‌వర్క్‌ ద్వారా పనిచేస్తాయి. ఫోన్లకు అనుసంధానించి, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను పంపించడానికి వీటిని వినియోగిస్తున్నారు. మునుపు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ఈ పరికరాలు, ఇప్పుడు చిన్న వాయిస్ నోట్‌లు, వీడియోలు పంపించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

వివరాలు 

5-10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి

ఈ పరికరాల సిగ్నల్స్‌ను పసిగట్టినప్పటికీ, వాటి సరిగ్గా ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం కష్టమవుతోంది. సాధారణంగా 5-10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పహల్గాం దాడి అనంతరం కూడా అల్ట్రాసెట్ల సిగ్నల్స్‌ను గుర్తించినప్పటికీ, అవి గమనించిన ప్రదేశాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు.