Loading...
Kulgam Encounter: కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ హతం.. భద్రతా దళాలకు అమిత్‌ షా అభినందనలు
కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ హతం.. భద్రతా దళాలకు అమిత్‌ షా అభినందనలు

Kulgam Encounter: కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ హతం.. భద్రతా దళాలకు అమిత్‌ షా అభినందనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ (CRPF), నిఘా సంస్థల సిబ్బందిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభినందించారు. కశ్మీర్‌ లోయలో క్రియాశీలకంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున కుల్గాంలో భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో అన్ని భద్రతా సంస్థల మధ్య అద్భుతమైన సమన్వయం కనిపించిందని అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇందులో పాల్గొన్న సిబ్బంది ధైర్యసాహసాలను దేశం అభినందిస్తోందని పేర్కొన్నారు.

వివరాలు

మసీదులో దాక్కున్న లతీఫ్‌ భట్‌.. లొంగిపోవడానికి నిరాకరణ

లతీఫ్‌ భట్‌ సహచరుడిగా భావిస్తున్న మరో ఉగ్రవాది ఉమర్‌ నిసార్‌ కూడా అంతకుముందు రోజు కుల్గాంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అమిత్‌ షా తన పోస్టులో తెలిపారు.

కుల్గాం జిల్లాలోని జంగల్‌పోరా ప్రాంతంలో లతీఫ్‌ భట్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

అతడిని లొంగిపోయేలా చేసేందుకు వీడియో కాల్‌ ద్వారా ప్రయత్నించాయి. అయితే, ''అల్లా తప్ప నాతో ఎవరూ లేరు'' అంటూ లతీఫ్‌ లొంగిపోవడానికి నిరాకరించాడు.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో మసీదులో నుంచి లతీఫ్‌ కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి అతడిని బయటకు తీసుకొచ్చిన తర్వాత కాల్చి చంపాయి.

వివరాలు

మసీదుకు నష్టం కలగకుండా ఆపరేషన్

ఆపరేషన్‌ సమయంలో మసీదుకు ఎలాంటి నష్టం కలగకుండా భద్రతా బలగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

లతీఫ్‌ బయటకు వచ్చేలా టియర్‌ గ్యాస్‌ ఉపయోగించి, అతడు బయటకు వచ్చిన తర్వాత మట్టుబెట్టాయి.

మసీదుకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగించడానికే ప్రాధాన్యం ఇచ్చామని ఎస్ఎస్‌పీ అనాయత్‌ అలీ తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

లష్కరే తోయిబాలో చేరిన ఏడాదికే హతం

లతీఫ్‌ భట్‌ 2025 నవంబర్‌లో లష్కరే తోయిబాలో చేరాడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన అతడికి పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు అందేవని అధికారులు చెబుతున్నారు.

శాంతిభద్రతలకు, పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై జరిగిన దాడికి లతీఫ్‌ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

ఉగ్రవాద సంస్థలో చేరిన ఏడాదికే భద్రతా దళాల ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు.

ADVERTISEMENT