AP Investment Protection Act: ఏపీలో పెట్టుబడులకు శాశ్వత భరోసా.. కొత్త చట్టం తీసుకొస్తున్న చంద్రబాబు ప్రభుత్వం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు దీర్ఘకాలిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్-2026' తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ చట్టాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులు చట్టంలోని నిబంధనలు, పెట్టుబడిదారులకు కల్పించనున్న భద్రతపై వివరించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చట్టంపై ప్రకటన చేశారు.
వివరాలు
పెట్టుబడులకు ఐదు అంశాలతో రక్షణ
పరిశ్రమలకు ఇచ్చిన హామీలను భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు మార్చకుండా, రద్దు చేయకుండా కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
ఈ హామీ మేరకు అధికారులు కేవలం రెండు వారాల్లోనే ముసాయిదాను రూపొందించారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పారిశ్రామిక విధానాలు, రాయితీలు, భూకేటాయింపుల్లో మార్పులు జరుగుతాయన్న ఆందోళనను తొలగించి, పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలిక విశ్వాసాన్ని పెంచడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.
ఇందులో ఐదు కీలక అంశాల ద్వారా పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నారు.
వివరాలు
స్పష్టమైన నిబంధనలు రూపొందరణ
- పరిశ్రమలకు కేటాయించిన భూములను తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేయకుండా స్పష్టమైన నిబంధనలు రూపొందించనున్నారు.
ఇప్పటికే అనుమతించిన ప్రోత్సాహకాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ కుదించకుండా హామీ ఇవ్వనున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతుల్లో మార్పులు చేయకుండా రక్షణ కల్పించనున్నారు. - ప్రాజెక్టులకు కేటాయించిన నీరు, ఇతర సదుపాయాల అమలులో అడ్డంకులు రాకుండా చూడనున్నారు.
ఎస్క్రో విధానంలో ప్రోత్సాహకాల చెల్లింపులకు సంబంధించిన నిర్ణయాలను రద్దు చేయకుండా భరోసా ఇవ్వనున్నారు.
దీనికి అదనంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఎన్ని రోజుల్లోపు చెల్లించాలనే అంశంపైనా చట్టంలో స్పష్టత ఇవ్వనున్నారు.
వివరాలు
వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
చట్టంలోని నిబంధనల అమలులో తలెత్తే సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది.
ప్రభుత్వ విధానాలు లేదా ఇతర కారణాలతో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు ఎదురైతే నేరుగా ఈ కమిటీని ఆశ్రయించి పరిష్కారం పొందే అవకాశం కల్పించనున్నారు.
ముసాయిదా చట్టాన్ని పరిశ్రమల శాఖ ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపింది.
న్యాయపరమైన పరిశీలన పూర్తయిన తర్వాత డిసెంబరు మొదటి వారంలో ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
వివిధ పారిశ్రామిక సంఘాలు, విదేశీ సంస్థలకు కూడా ముసాయిదాను పంపించి సూచనలు తీసుకోనున్నారు.
వివరాలు
ఏప్రిల్ నుంచి అమలులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ
వచ్చే ఏడాది జనవరిలో చట్టానికి తుది రూపు ఇచ్చి కేబినెట్ ఆమోదానికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన అనంతరం మార్చిలో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని ప్రణాళిక రూపొందించింది.
ఆ తర్వాత ఏప్రిల్ నుంచి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంఓయూలు వచ్చిన నేపథ్యంలో వాటిని క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేయడం కీలకంగా మారింది.
గతంలో విధానపరమైన మార్పుల కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైన అనుభవాలున్నాయి.
ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన రక్షణ కల్పించడం ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.