Palanadu: పల్నాడు జిల్లా కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ.. ఈరోజే బాధ్యతలు చేపట్టాలన్న ఈసీ
పోలింగ్ ముగిసి ఐదు రోజులు కావస్తున్నా పల్నాడు ప్రాంతం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపధ్యంలో పల్నాడు జిల్లా కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకంపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ కూడా విధించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్,తిరుపతి ఎస్పీలు బదిలీ
ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు,అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం..ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకువాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్,తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది. ఎన్నికల తదనంతర హింసపై టిడిపికూటమి,వైసీపీలు వేరు వేరుగా గవర్నర్ ను అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశాయి. కాగా ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలీసులు రెండు పార్టీల అగ్రనేతలను పిలిచి బుద్ధిగా నడుచుకుంటే సరే లేదంటే కఠిన చర్యలు తప్పవని సుతి మెత్తగా హెచ్చరించారని తెలుస్తోంది.