LOADING...
Nagarjuna Sagar: సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం పునఃప్రారంభం
సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం పునఃప్రారంభం

Nagarjuna Sagar: సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం పునఃప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దట్టమైన నల్లమల అటవీ అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణానది నడుమ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం, పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. ఈ అద్భుత ప్రయాణాన్ని నవంబర్ 22 నుంచి తెలంగాణ పర్యాటక శాఖ పునరుద్ధరించనుంది. పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. నాగార్జున సాగర్‌-శ్రీశైలం రాకపోకలకు పెద్దలకు రూ.3,250, పిల్లలకు రూ. 2,600 టికెట్ ధర నిర్ణయించారు. ఒక్కదిశ ప్రయాణం కోసం నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి వెళ్లే పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600 వసూలు చేయనున్నారు. ఈ లాంచీ ప్రయాణంలో పర్యాటకులు నందికొండ, ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ సహజ సౌందర్యాలను ఆస్వాదిస్తారు.

Details

శ్రీశైల మల్లన్న దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నాగార్జున సాగర్ కు

కృష్ణానదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేసే ఈ ప్రయాణం సుమారు ఆరు గంటల ఏకధాటి జర్నీగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం సౌకర్యం లాంచీలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 10:30 గంటలకు నాగార్జునసాగర్ నుంచి బయలుదేరిన లాంచీ, సాయంత్రం 4:30 గంటలకు శ్రీశైలం పాతాళగంగ చేరుకుంటుంది. మరుసటి రోజు పర్యాటకులు, భక్తులు శ్రీశైల మల్లన్న దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత, లాంచీ తిరిగి నాగార్జునసాగర్‌కు ప్రయాణిస్తుంది. అయితే శ్రీశైలం‌లో గదుల బుకింగ్, ట్రాన్స్‌పోర్ట్ వంటి ఖర్చులు ప్రతి ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ స్పష్టం చేసింది.

Details

వంద టికెట్లు బుక్ చేస్తే ప్రత్యేకంగా లాంచ్ సౌకర్యం

ఈ నెల 22 నుంచి ప్రతి శనివారం టికెట్ బుకింగ్‌ ఆధారంగా లాంచీ సర్వీస్‌ను కొనసాగిస్తామని సంస్థ తెలిపింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు కనీసం 100 టికెట్లు బుక్ చేస్తే, ఆ రోజులకు కూడా ప్రత్యేకంగా లాంచీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ టికెట్ల కోసం tgtdc.in వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం: బషీర్‌బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ 9848540371, 9848125720 నాగార్జునసాగర్ లాంచీ యూనిట్: 7997951023