PothinaMahesh:జనసేనకు భారీ షాక్...పార్టీకి కీలక నేత పోతిన మహేష్ గుడ్ బై
ఎన్నికల వేళ జనసేనకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయవాడకు చెందిన పోతిన మహేష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వంతో సహా పార్టీకి సంబంధించిన అన్ని పదవులకు సోమవారం ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త తరం నేతలను తయారు చేస్తారని భావించి అందరికీ మంచి జరుగుతుందని తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నారు. 2019 లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా ఆయనతో నడిచి ఇప్పుడు భంగ పడ్డాం. నటించేవారు ఎప్పటికీ నాయకులు కాలేరని మండిపడ్డారు.
స్వార్థ రాజకీయ ప్రజయోజనాలు కలిగిన వ్యక్తి పవన్: పోతిన మహేష్
స్వార్థ రాజకీయ ప్రజయోజనాలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. పవన్ ను నమ్ముకుని తాము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే పవన్ లాంటి వారు ఆస్తులు కూడ బెట్టుకున్నారని చెప్పారు. అందుకే పార్టీ నిర్మాణం పైగానీ, కేడర్ పై గానీ పవన్ కళ్యాణ్ ఏనాడూ దృష్టి పెట్టలేదన్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ బలోపేతం కోసం అవిశ్రాంతంగా పోతిన మహేష్ కృషి చేశారు. చివరకు ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా వేరేవారికి సీటును కేటాయించారు. అధికారంలోకి వస్తే ఏదైనా పదవి ఇస్తామని పవన్ కల్యాణ్ పోతిన మహేష్ కు చెప్పి చూసినా పవన్ ను నమ్మేది లేదని తేల్చిచెప్పేశారు.