Nidamarru: నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో 'లీప్' పాఠశాల.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో రూపొందించిన 'లీప్' (ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రావీణ్య కేంద్రం) పాఠశాలను రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తగా నిర్మించిన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా ప్రాంగణం, మూసివేసిన క్రీడా మైదానం, ఫుట్‌బాల్ మైదానం, రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన బహిరంగ రంగస్థలం, ఒకేసారి 400 మంది విద్యార్థులు భోజనం చేసే భోజనశాల వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
వివరాలు
రూ.16 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలు
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఆరు ప్రయోగ గదులను ఏర్పాటు చేశారు. ఇందులో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, కంప్యూటర్ విద్య, వృత్తి విద్యతో పాటు ప్రత్యేక ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1983లో 5.2 ఎకరాల విస్తీర్ణంలో 12 గదులతో ప్రారంభమైన ఈ పాఠశాలను మంత్రి లోకేశ్ చొరవతో 25 గదులకు విస్తరించారు. రూ.16 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. పాఠశాల భవనాల నిర్మాణం పూర్తికాకముందు వరకు ఇక్కడ 510 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 1,100కు పెరిగింది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నారు.