LOADING...
Odisha: పొద్దున పాఠాలు.. మధ్యాహ్నం వ్యవసాయం.. సైన్స్ లెక్చరర్ సక్సెస్ స్టోరీ!
పొద్దున పాఠాలు.. మధ్యాహ్నం వ్యవసాయం.. సైన్స్ లెక్చరర్ సక్సెస్ స్టోరీ!

Odisha: పొద్దున పాఠాలు.. మధ్యాహ్నం వ్యవసాయం.. సైన్స్ లెక్చరర్ సక్సెస్ స్టోరీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం కూడా లాభదాయకంగా సాగించవచ్చని, అది ఒక ఉత్తమ ఉపాధి మార్గమని ఒడిశాకు చెందిన ఓ సైన్స్‌ లెక్చరర్‌ తన ఆచరణతో నిరూపిస్తున్నారు. ఉదయం కాలేజీలో పాఠాలు చెప్పే ఆయన, మధ్యాహ్నం నుంచి ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌లో నిమగ్నమై ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కేవలం తన కుటుంబానికే కాదు, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలేశ్వర్‌ జిల్లాలోని తలనగర్‌ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ కుమార్‌ రౌత్‌ (44) బహానగర్‌ కళాశాలలో సైన్స్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నారు.

Details

6 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్

చిన్ననాటి నుంచే వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో తనకు చెందిన 6 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఒకే చోట విభిన్న పంటలు, పశుపోషణ, చేపల పెంపకం వంటి అనేక వ్యవసాయ కార్యకలాపాలను కలిపి సాగు చేయడం ఆయన ప్రత్యేకత. తన పొలాల్లో కూరగాయలు, మూడు నెలల కాలపరిమితి గల సింధు వరి, బంతి పూలు, థాయ్‌ బొప్పాయి, ఆవాలు, అరటి, ఆలుగడ్డ, ఉల్లిపాయలతో పాటు కోళ్ల పెంపకం, పశుపోషణ కూడా చేస్తున్నారు. అదేవిధంగా రెండు చెరువుల్లో చేపల పెంపకం, మరో చెరువులో రొయ్యల పెంపకాన్ని చేపట్టి ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా ప్రణాళికబద్ధంగా వ్యవసాయం సాగిస్తున్నారు.

Details

ఏటా రూ.5 లక్షలకుపైగా ఆదాయం

ఈ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ ద్వారా ప్రమోద్‌కు ఏటా రూ.5 లక్షలకుపైగా ఆదాయం లభిస్తోంది. ఆయన కాలేజీ పనుల నిమిత్తం అందుబాటులో లేని సమయంలో, భార్య ప్రియదర్శిని దాస్‌ వ్యవసాయ కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పనలోనూ ముందుండే ప్రమోద్‌, తన పొలాల ద్వారా సుమారు 10 మందికి స్థిరమైన జీవనాధారాన్ని అందిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని చూపిస్తూ, యువతకు ఆయన ప్రేరణగా నిలుస్తున్నారు.

Advertisement