Bihar Elections: జీవికా దీదీలకు నెలకు రూ.30వేలు.. తేజస్వి ఎన్నికల హామీ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు సాధించేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కీలక హామీతో ముందుకొచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ.30,000 వేతనం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఇప్పటికే వారు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు, భవిష్యత్తులో వడ్డీ లేని రుణాలు అందించడమే కాక రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ఈ విషయాలను ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
వివరాలు
భవిష్యత్‌లో ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారు
ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల మహిళల ఖాతాల్లో రూ.10,000 జమ చేయడాన్ని తేజస్వీ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఇది సాయం కాదని రుణం అని అమిత్‌షా కూడా పేర్కొన్నట్లు గుర్తుచేశారు. కాబట్టి ఆ మొత్తాన్ని తరువాత తిరిగి వసూలు చేసే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి భవిష్యత్‌లో ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలోనే, మహిళా ఓటర్లను.. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉన్న జీవికా దీదీలను.. ఆకర్షించేందుకు ఈ కొత్త హామీలను ప్రకటించినట్లు తెలిపారు.
వివరాలు
జీవికా దీదీలు ఎవరు?
బిహార్ ప్రభుత్వం 2007లో ప్రారంభించిన జీవికా కార్యక్రమంలో భాగంగా గ్రామీణ మహిళల కోసం స్వయం సహాయక సమూహాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వారికి రుణాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందించడం ప్రధాన లక్ష్యం. గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల జీవికా దీదీలు పనిచేస్తున్నారు.