LOADING...
CM Chandrababu: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం
ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

CM Chandrababu: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా పని చేయాలని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన తెలిపారు. సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన అనంతరం ఆయన మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Details

ఏప్రిల్‌ 2న కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టు

2025-26 ఆర్థిక సంవత్సరంలో మంత్రులు, శాఖల కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్‌ 2న కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. దస్త్రాల పరిష్కారం, కీలక పనితీరు సూచీలు (KPI) లక్ష్యాల సాధన, శాఖలు సాధించిన విజయాలు, కేంద్రం నుంచి నిధుల సమీకరణ, వాటి వినియోగంలో చూపిన చొరవ వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో రాష్ట్ర పరిస్థితులను గాడిలో పెట్టగలిగామని, ఇకపై అభివృద్ధి వేగం పెరగాలని, 2026-27 ఆర్థిక సంవత్సరం కీలక మైలురాయిగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు ఎక్కువగా పర్యటనలు చేసి సమీక్షలు నిర్వహించాలని కూడా సూచించారు.

Details

'చేసింది చెప్పాలి' - మంత్రులకు సీఎం సూచన

కొంతమంది మంత్రులు తమ శాఖల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రజలకు సమర్థంగా తెలియజేయలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకోవడం లేదని అన్నారు. "మీ శాఖల్లో చేసిన పనిని ప్రజలకు చెప్పుకోవాలి కదా? గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పటికి కొంతవరకు గాడిలో పెట్టగలిగాం. ఇకమీదట మీరు వేగం పెంచాలి. సాంకేతికతను ఉపయోగించుకుంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సీఎం తెలిపారు. అదే సమయంలో, పార్టీ కార్యాలయం నుంచి పంపే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంలో మంత్రులు వెనకబడి ఉన్నారని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Details

ఏప్రిల్‌ 2 నుంచి 90 రోజుల 'జలధార' కార్యక్రమం

ఏప్రిల్‌ 2 నుంచి 90 రోజులపాటు 'జలధార' కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగించి చివరి పొలాల వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి: రైతులు నారుమళ్లు వేయడానికి మే 15 నాటికి కాలువల్లో నీరు విడుదల చేయాలి. గత ప్రభుత్వ కాలంలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం కావడంతో 6-7 లక్షల ఎకరాలకు నీరు అందలేదని, వాటిని మళ్లీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం కాసిపెంట్లలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ విస్తరణకు సంబంధించిన రాయితీల అంశం చర్చకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Advertisement

Details

కృష్ణా కరకట్ట బలోపేతం

రేపల్లె-అవనిగడ్డ ప్రాంతంలో కొన్నిచోట్ల కృష్ణా నది కరకట్ట బలహీనంగా ఉందని మంత్రి ఆగాని స‌త్య‌ప్ర‌సాద్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం, ఎక్కడెక్కడ కరకట్ట బలహీనంగా ఉందో గుర్తించి వెంటనే బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ మార్చి 16న అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. విగ్రహానికి మంచి పేరు నిర్ణయించాలని సూచించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం మంత్రులు సవిత, సత్యకుమార్, దుర్గేష్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు.

Details

వంటగ్యాస్‌, నిత్యావసరాల కొరత లేకుండా చర్యలు

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు యుద్ధాలు వంటి సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. వారికి అవసరమైన సహాయం అందించాలన్నారు. అలాగే రాష్ట్రంలో వంటగ్యాస్‌, ఇతర నిత్యావసరాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాల పర్యవేక్షణ కోసం మంత్రులు కేశవ్‌, అచ్చెన్నాయుడు, మనోహర్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్‌ స్టౌల వినియోగం పెరుగుతోందన్న విషయాన్ని మంత్రి కేశవ్‌ ప్రస్తావించగా, దాంతో విద్యుత్‌ వినియోగం పెరిగే అవకాశముందని సీఎం అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లు మెరుగుపడ్డాయని, నీటి సంఘాల ద్వారా నీటి తీరువా వసూళ్లను కూడా పెంచాలని మంత్రి రామానాయుడికి సీఎం సూచించారు.

Details

ఆరుగురు మంత్రులు గైర్హాజరు

వ్యక్తిగత పనులు, అనారోగ్య కారణాల వల్ల ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, గొట్టిపాటి రవికుమార్‌, వంగలపూడి అనిత, టీజీ భరత్‌ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు.

Advertisement