LOADING...
Lok Kalyan: వీధి వ్యాపారుల కోసం 'లోక్‌ కల్యాణ్‌' మేళాలు.. ప్రత్యేక ప్రచారం.. ఫుడ్‌ వెండర్స్‌కు శిక్షణ 
ప్రత్యేక ప్రచారం.. ఫుడ్‌ వెండర్స్‌కు శిక్షణ

Lok Kalyan: వీధి వ్యాపారుల కోసం 'లోక్‌ కల్యాణ్‌' మేళాలు.. ప్రత్యేక ప్రచారం.. ఫుడ్‌ వెండర్స్‌కు శిక్షణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆదేశాల ప్రకారం, వీధి వ్యాపారుల సంక్షేమం సహా పలు కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ప్రత్యేక ప్రచార మేళాలను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్‌ 2న జరిగే గాంధీ జయంతి వరకు ఈ మేళాలు కొనసాగుతాయి. వీటిని 'లోక్‌ కల్యాణ్‌ మేళాలు' పేరుతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంలో కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన వీధి విక్రేతలను ప్రధానమంత్రి స్వనిధి (పీఎం స్వనిధి) పథకంలో చేర్చే అవకాశం కల్పించనున్నారు.

వివరాలు 

ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు రుణాల పంపిణీ

గురువారం నుంచి ఆరంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా పలు చర్యలు చేపట్టనున్నారు. వాటిలో ముఖ్యంగా: పునరుద్ధరించిన పీఎం స్వనిధి పథకం కింద కొత్త దరఖాస్తులను ప్రోత్సహించడం ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు రుణాల పంపిణీ సులభతరం చేయడం బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) సహకారంతో వీధి ఆహార విక్రేతలకు శిక్షణ ఇవ్వడం వీధి వ్యాపారుల కుటుంబాల సామాజిక-ఆర్థిక సమాచారం సేకరించడం విక్రేతల సామర్థ్యాలను పెంపొందించి, తగిన సంక్షేమ పథకాలతో వారి ఆదాయం పెరిగేలా చేయడం

వివరాలు 

రుణాల పంపిణీ లక్ష్యం 

ఈ ప్రత్యేక మేళాల ద్వారా మొత్తం 14,800 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వీరిలో తొలి విడతలో 13,470 మందికి రుణాలు అందజేస్తారు. రెండో విడతలో 1,330 మందికి రుణాలు ఇవ్వనున్నారు. తొలి విడత లబ్ధిదారులు పొందే రూ. 15,000 రుణంను 12 నెలల్లో చెల్లించాలి. రెండో విడత లబ్ధిదారులు పొందే రూ. 25,000 రుణంను 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

వీధి ఆహార విక్రేతలకు శిక్షణ 

ఆహార పదార్థాలు విక్రయించే వీధి వ్యాపారుల కోసం రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో వెయ్యిమంది విక్రేతలకు నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం, కల్తీ నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. వారికి ఫుడ్‌ సేఫ్టీ లైసెన్సులు కూడా జారీ చేస్తారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బ్యాంకులు, డిజిటల్‌ పేమెంట్‌ ఎగ్రిగేటర్లు (DPAలు), టౌన్‌ వెండింగ్‌ కమిటీలు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, ఎన్జీఓలు, విక్రేత సంఘాలు తదితర సంస్థలు చురుకుగా పాల్గొంటాయి.

వివరాలు 

ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో రుణాల పంపిణీ 

2020 నుంచి ఇప్పటి వరకు వీధి విక్రేతలకు అందజేసిన రుణాల వివరాలు ఇలా ఉన్నాయి: మొదటి విడత: లక్ష్యం 1,34,412 మంది. అందులో 58,600 మందికి రూ. 58.60 కోట్లు రుణాలుగా అందించారు. రెండో విడత: లక్ష్యం 34,035 మంది. ఇందులో 26,992 మందికి రూ. 52.18 కోట్లు రుణాలుగా ఇచ్చారు. మూడో విడత: లక్ష్యం 7,178 మంది. అయితే దీనికంటే ఎక్కువగా 10,686 మందికి రూ. 53.43 కోట్లు రుణాలుగా అందించారు.