Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విపక్షాల కూటమిలో టీఎంసీ భాగమైనప్పటికీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల పంపకాలపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, టీఎంసీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చల ద్వారా పరిష్కారం లభించకపోవడంతో బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లనున్నట్లు మమతా ప్రకటించారు. బెంగాల్‌లో మొత్తం 42లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా రెండు సీట్లను మాత్రమే కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు టీఎంసీ ముందుకు వచ్చింది. కానీ కాంగ్రెస్ మాత్రం 10-12సీట్లను అడుగుతోంది. పొత్తు కుదిరే అవకాశం లేకపోవడంతో బెంగాల్ వరకు వరకు ఒంటరిగా వెళ్లాలని మమతా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టీఎంసీ లేకుండా పొత్తును ఊహించలేం: జైరాం రమేష్
మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం విపక్ష కూటమిలో భయాందోళనలు సృష్టించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ లేకుండా పొత్తును ఊహించలేమని అన్నారు. టీఎంసీ లేని ఇండియా కూటమిని ఊహించలేమన్నారు. అదే సమయంలో మమత సింహంలా పోరాడుతోందని శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబించాలని జేడీయూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) జాతీయ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ, ఆమె పార్టీ ఇండియా కూటమిలో భాగమేనని అన్నారు. ఈ ప్రకటన వెనుక ఏదైనా వ్యూహం ఉండొచ్చన్నారు.