కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో గల శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. 400రోజలు పాటు ఈ పాదయాత్ర సాగనుంది. కుప్పుంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కుప్పం చేరుకొని పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లోకేశ్ మామ, సినీనటుడు బాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్నారు.
లోకేశ్ వెంట 400మంది వాలంటీర్లు
లోకేశ్ పాదయత్ర కోసం టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర 400 రోజలు జరగనున్న నేపథ్యంలో అన్ని రోజులు ఆయన వెంట 400మంది వాలంటీర్లు ఉండేలా టీడీపీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పట్ల నిబద్ధతతో పని చేసే కార్యకర్తలను వాలంటీర్లుగా చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాలంటీర్ల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లోకేశ్ బస చేసే ప్రాంతాల్లో వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా జర్మన్ షడ్లను ఏర్పాటు చేస్తారు. మంచాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడే భోజన వసతిని కల్పిస్తారు.